ఆత్మీయత చాటిన స్వర్ణ సంబరం
గుంటూరు మెడికల్ : గుర్తుకొస్తున్నాయి... ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి.. అంటూ గుంటూరు వైద్య కళాశాలలో అడుగుపెట్టగానే ఆరు పదులు దాటిన సీనియర్ వైద్యులంతా ఆనాటి ఘటనలను నెమరువేసుకున్నారు. 50 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులను నేడు కళ్లారా చూసి పలువురు తమ స్నేహ మధురిమలు పంచుకున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న 1975 ఫ్రిబవరి బ్యాచ్ వైద్యులు తమ స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి విదే శాల్లో స్థిరపడి పేరు ప్రఖ్యాతులు గాంచిన వైద్యులుగా సేవలందిస్తున్న వారు రీయూనియన్ పేరుతో గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో ఆదివారం కలిశారు. కాలేజీలోకి అడుగుపెట్టగానే వారంత కుర్రకారు మాదిరిగా ఉరకలెత్తారు. తరగతి గదుల్లో కలియతిరిగి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నిక్ నేమ్‌లతో పిలుచుకున్న పిలుపులు... ఒక్కొక్కరు గుర్తు పట్టలేని విధంగా ఎలా మారిపోయారో అని ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. బ్యాచ్‌లో 150 మందికిగాను సుమారు 20 మంది అకాల మృత్యువుకు గురయ్యారు. తోటి స్నేహితులను తలచుకుని వారికి నివాళులు అర్పించారు. సుమారు 105 మంది వైద్యులు తమ కుటుంబాలతో హాజరై సందడి చేశారు. పండుగలా ఒకే చోట కూర్చుని విందు భోజనాలు చేసి ఆనందంగా గడిపారు.
ప్రత్యేకమైన బ్యాచ్ ఇది...
గుంటూరు వైద్య కళాశాలలో ఒకే ఏడాది రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు చదివిన ప్రత్యేకత 1975 బ్యాచ్‌కు ఉంది. ఎంబీబీస్ ప్రవేశాలకు కనీస వయస్సు 17 ఉండాలని నిబంధన పెట్టడంతో ఈ బ్యాచ్ వారు కోర్టుకెళ్లారు. అనేక మంది 16 సంవత్సరాలు నిండిన వారు ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణులై సీట్లు సాధించారు. కోర్టుకు వెళ్లటంతో 1974లో ఎంట్రన్స్ రాసిన వారు 1975 ఫ్రిబవరిలో గుంటూరు వైద్య కళాశాలలో చేరారు. రెగ్యులర్‌గా 1975లో నవంబర్‌లో ఒక బ్యాచ్ వారు కూడా చేరారు. కోర్టుకు వెళ్లి సీట్లు తెచ్చుకున్న బ్యాచ్‌గా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యాచ్‌కు చెందిన సీనియర్ మత్తువైద్య నిపుణులు డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా, హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా పనిచేశారు. మరో వైద్యురాలు డాక్టర్ శైలబాల గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించారు. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇరువురు వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోపీచంద్, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోతినేని రమేష్‌బాబు, డాక్టర్ లోకేశ్వరరావు, డాక్టర్ బైరపనేని రమేష్‌లు ఈ బ్యాచ్‌కు చెందిన వారే. రీ యూనియన్‌కు ఐఎంఏ గుంటూరు మాజీ అధ్యక్షుడు డాక్టర్ గడ్డం విజయసారథి, డాక్టర్ చేబ్రోలు విశ్వేరరావులు కన్వీనర్స్‌గా వ్యవహరించారు. డాక్టర్ సీతారామా, డాక్టర్ పెద్దిప్రసాద్‌లు యాక్టివ్ మెంబర్స్‌గా పనిచేశారు.
దేశ విదేశాల నుంచి వైద్యులు హాజరు రూ.50 లక్షల విరాళం ప్రకటన
గురువులకు సన్మానం....
తమకు విద్యాబోధన చేసి తమ ఉన్నత స్థితికి కారణమైన సీనియర్ వైద్యులను 1975 బ్యాచ్ వైద్యులు ఘనంగా సన్మానించారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, అనాటమి ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు, ఎస్‌పీఎమ్ ప్రొఫెసర్ డాక్టర్ శివరామప్రసాద్‌లను సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. వీరితోపాటుగా గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారిని కూడా సన్మానించారు. తమ బ్యాచ్ స్వర్ణోత్సవాలకు గుర్తుగా రూ.50 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు రీ యూనియన్ కన్వీనర్ డాక్టర్ గడ్డం విజయసారథి ప్రకటించారు. వీలైతే అంతకంటే ఎక్కువ మొత్తంలో వైద్య కళాశాల అభివృద్ధికి ఇస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment