‘కోత’ల పాలనలో రైతులకు షాక్!
కొల్లిపర: తెనాలి నియోజకవర్గంలో రబీ సాగులో రైతులు మొక్కజొన్న, జొన్న పసుపు, అరటి కూరగాయలు వంటి పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా పంటలకు నీటి తడులలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో విద్యుత్ వెతలు వెంటాడుతున్నాయి. తొమ్మిది గంటలు ఇచ్చే వ్యవసాయ విద్యుత్ సరఫరాను గత మూడు రోజుల నుంచి ఏడు గంటలకు ఆ శాఖ కుందించింది. దీంతో అవసరమైన నీటి తడులు ఇవ్వటానికి అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. మొక్కజొన్న, జొన్న వంటి పంటలు ఎదుగుదల దశలో నీటి తడులు సమయానికి ఇవ్వకపోతే పంట దిగుబడులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తెనాలి నియోజకవర్గంలో ఇలా....
తెనాలి నియోజవర్గంలో తెనాలి మండలంలో జొన్న 7323, మొక్కజొన్న 5742, పప్పు ధాన్యాలు 2280, పసుపు 30, దుగ్గిరాల మండలంలో జొన్న 4000, మొక్కజొన్న 11000, పప్పు ధాన్యాలు 4000, పసుపు 100, కొల్లిపర మండలంలో జొన్న 6450, మొక్కజొన్న 7150, పసుపు 1450 ఎకరాలలో సాగు చేస్తున్నారు. వీటితోపాటు కూరగాయలు, అరటి వంటి వివిధ పంటలు వేశారు. ప్రస్తుతం రబీలో సాగు చేస్తున్న పంటలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. విద్యుత్ కోతతో పంటలకు నీటి తడులు అందించే సమయంలో సరైన విద్యుత్ లేకపోవడంతో పంట దిగుబడికి ఇబ్బందులు తప్పవని రైతులు వాపోయారు. కూలీలకు రూ.800 ఇచ్చి పెట్టుకున్నా పని కావడం లేదన్నారు. ఒక రోజుతో అయిపోయే పనికి మరొక రోజు పెట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇలా...
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగ చేశారని. దీంతో తెనాలి, కొల్లిపర మండ భూములలో రెండు పంటలు పండించుకోగలిగామని రైతులు అంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా పగటి పూట 9 గంటల విద్యుత్ ఎటువంటి ఆటంకులు లేకుండా, కరోనా సమయంలో కూడా సరఫరా చేశారని గుర్తుచేస్తున్నారు. రెండు పంటలతో ఆదాయాన్ని గడించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగులో అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదన్నారు. పెరిగిన ఎరువులు ధరలు, అందని పెట్టుబడి సాయం వంటి కష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ అలసత్వ ధోరణి కారణంగా తొమ్మిది గంటలు సరఫరా అయ్యే విద్యుత్‌ను ఏడు గంటలకు కుందించటంతో పంటల పరిస్థితి అందోళనకరంగా మారిందిని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కారు వ్యవసాయానికి పూర్తిస్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరుతున్నారు.
కూటమి సర్కారు కేవలం ‘కోత’లకే పరిమితమైంది. మాటలు చెప్పడంలో ఆరితేరిన పాలకులు.. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో మాత్రం విఫలమయ్యారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న లబ్ధిని కూడా ప్రజలు దూరం చేస్తోంది కూటమి సర్కార్. ఇదే కోవలో రైతులకు నిరంతరాయంగా పగలు 9 గంటలు విద్యుత్తు ఇవ్వడంలో చేతులెత్తేసింది. దీంతో రైతాంగం తీవ్ర ఆవేదనకు గురవుతోంది.
వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాన్ని కుదించిన కూటమి సర్కార్
ప్రస్తుతం ఏడు గంటలే సరఫరా
క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్న వైనం
పంటల నీటి తడులకు తప్పని ఇబ్బందులు
మున్ముందు పరిస్థితిపై
అన్నదాతల్లో ఆందోళన
పగలు 9 గంటలు నిరంతరాయ
సరఫరాకు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment