దాడులు, అఘాయిత్యాలతో అరాచకపాలన | - | Sakshi
Sakshi News home page

దాడులు, అఘాయిత్యాలతో అరాచకపాలన

Published Fri, Jan 24 2025 2:08 AM | Last Updated on Fri, Jan 24 2025 2:08 AM

దాడులు, అఘాయిత్యాలతో అరాచకపాలన

దాడులు, అఘాయిత్యాలతో అరాచకపాలన

ఒంగోలు సిటీ: రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచకపాలన సాగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసుల వల్ల రిమాండ్‌లో ఉన్న ఏడుగురు అమాయక యువకులను ఒంగోలులోని జిల్లా జైలులో గురువారం మేరుగు నాగార్జున కలిసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తూ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయన్నారు. నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో అధికార పార్టీ ఒత్తిడి మేరకు ఏ సంబంధం లేని కూలి చేసుకునే యువకులను కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మనబ్రోలులో కష్టం మీద బతికే వారిని గేదె దగ్గర గొడవ అని తీసుకొచ్చి కేసులు పెట్టి ఏడుగురిని జైలుకు పంపించడం దారుణమన్నారు. అమ్మనబ్రోలుకు చెందిన సాయి అనే యువకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు నిజమైన హక్కులు కాపాడుకోవడానికేగానీ.. వేధించడానికి కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని పోలీసులు, కేసులు పెట్టేవారు, ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. అమ్మనబ్రోలులో సాయి అనే బీసీ యువకుడు వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలు కట్టాడని, ఫ్లెక్సీల దగ్గర గొడవైందని, బూతులు తిట్టాడనే కారణంతో ఒక గిరిజన అమ్మాయితో కేసు పెట్టించి జైలుకు పంపడం దారుణమని మేరుగు నాగార్జున అన్నారు. ఇలాంటి కేసులు రాబోయే రోజుల్లో టీడీపీ నేతలపై కూడా పెట్టే రోజులు వస్తాయని, అందువలన ఈ కేసులను దుర్వినియోగం చేసుకోవద్దని అన్నారు. ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీ కనిపిస్తే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ కట్టినందుకే

నా బిడ్డపై కుట్ర...

బాధితుడు సాయి తల్లి సలోమి మాట్లాడుతూ తన బిడ్డ వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ కట్టినందుకు ఆ ఫ్లెక్సీ చించారని, పైగా, తన బిడ్డను జైలు పాలు చేశారని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బిడ్డకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన అట్టర్‌ఫ్లాప్‌

దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారని మేరుగు నాగార్జున విమర్శించారు. పట్టుమని పది కోట్లు పెట్టుబడులు తేలేకపోవడం సిగ్గుచేటన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం లక్షా 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిందన్నారు. పవన్‌కళ్యాణ్‌ని సైడ్‌ చేసి లోకేష్‌ని ప్రమోట్‌ చేయడానికే చంద్రబాబు, లోకేష్‌ పర్యటన అని అన్నారు. చంద్రబాబు దావోస్‌ పర్యటన ద్వారా ఏం సాధించారనే దానిపై పవన్‌ కల్యాణ్‌ నిలదీయాలన్నారు. మేరుగు నాగార్జున వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, కొమ్మూరు సుధాకర్‌, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, తేళ్ల పుల్లారావు, పోలినేని కోటేశ్వరరావు, కోయ హనుమయ్య, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులను

భయాందోళనకు గురిచేస్తున్న

కూటమి ప్రభుత్వం

మాజీ మంత్రి మేరుగు నాగార్జున

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement