నారసింహుని నిత్యాన్నదానానికి విరాళం
మంగళగిరి (తాడేపల్లిరూరల్): మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి దాతలు రూ.ఐదు లక్షల వితరణ అందించారు. పెనుమాకకు చెందిన కళ్ళం శివారెడ్డి కుటుంబ సభ్యులు రూ.ఐదు లక్షల ఐదువేల 516ను విరాళంగా గురువారం ఆలయ సహాయ కమిషనర్ అన్నపరెడ్డి రామకోటిరెడ్డికి అందించారు.
సీజనల్ హాస్టల్ ప్రారంభానికి దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గుంటూరులోని మిర్చియార్డు సమీపంలో సీజనల్ హాస్టల్ ప్రారంభించేందుకు అర్హులైన ఎన్జీవోలు, డ్వాక్రా గ్రూపులు ఈనెల 25లోపు డీఈవో కార్యాలయంలోని సమగ్రశిక్ష ప్రాజెక్టు విభాగంలో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మిర్చి యార్డుకు జీవనోపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన కుటుంబాల్లోని పిల్లల కోసం సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. మొత్తం 27 సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సబ్ జైల్లో సౌకర్యాల
పరిశీలన
సత్తెనపల్లి: సబ్ జైల్లో సౌకర్యాలపై గుంటూరు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) లీలావతి ఆరా తీశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సబ్ జైలును గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా సబ్‌జైలు పరిసరాలను పరిశీలించారు. ఆహారం, వంటశాల, స్నానపు గదులను సందర్శించారు. రిమాండ్ ఖైదీల వివరాలను సూపరింటెండెంట్ వెంకటరత్నం వివరించారు. రిజిస్టర్ తనిఖీ చేసి, అందుతున్న వసతులను జడ్జి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. రిమాండ్ ఖైదీలు చట్టప్రకారం హక్కులను తెలుసుకోవాలన్నారు. తెలిసో తెలియకో తప్పు చేసి జైలుకు వచ్చారని, భవిష్యత్తులో అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది బీఎల్ కోటేశ్వరరావు, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని తదితరులు ఉన్నారు.
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ
ఏఈఆర్‌ఓగా సురేష్
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఏఈఆర్‌ఓ) అవార్డుకు పల్నాడు జిల్లా వినుకొండ తహసీల్దార్ ఎస్.సురేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అండ్ ఈవో సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న 92 మందిని ఎంపిక చేయగా.. పల్నాడు జిల్లాలో ముగ్గురికి అవకాశం లభించింది. వారిలో ఏఈఆర్‌ఓగా వినుకొండ తహసీల్దార్ ఎస్.సురేష్, బూత్ లెవెల్ అధికారులుగా గురజాల నియోజకవర్గం 300వ పోలింగ్ స్టేషన్ నుంచి ఎం.శ్రీరాములు, పెదకూరపాడు నియోజకవర్గం 182వ పోలింగ్‌స్టేషన్ నుంచి ఇ.రాము ఎంపికయ్యారు. ఈనెల 25న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సంబరాల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.
బంగారు నగల
వ్యాపారి పరారీ
దాచేపల్లి: నగర పంచాయతీ పరిధిలోని పొట్లబజారులో నివాసం ఉంటున్న బంగారు నగల వ్యాపారి పరారయ్యాడు. స్థానికంగా బంగారం వ్యాపారం చేసే ఆయన సుమారు రూ. 10 కోట్ల వరకు అప్పులు చేశాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళాలు వేసి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. అతనికి అప్పులు ఇచ్చిన వారంతా దుకాణం వద్ద గుమికూడి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment