ఫిర్యాదులొస్తే ఇసుక రీచ్‌లను నిలిపివేస్తాం
తెనాలి: చీకటి మాటున ఇసుక దోపిడీ.. మంత్రి నాదెండ్ల ఇలాకాలో ఇసుక అక్రమ రవాణా శీర్షికలతో గురువారం ‘సాక్షి’ గుంటూరు జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం మధ్యాహ్నం తెనాలి ట్రైనీ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ కొల్లిపర మండలంలోని మున్నంగి, బొమ్మువానిపాలెంలోని 14, 15 రీచ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, రవాణా అంశాలను పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని అదేశించారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇసుక తవ్వకాలు, లోడింగ్ చేయరాదని స్పష్టం చేశారు. కృష్ణానది లోపల పగటిపూట మాత్రమే ఇసుక తవ్వాలనీ, అది కూడా యంత్రాలను ఉపయోగించకుండా కూలీలతోనే తీయించి, ట్రాక్టర్లతో డంపింగ్ ప్రదేశాలకు చేర్చుకోవాలని స్పష్టంగా చెప్పారు. అక్కడ కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే వాహనాలకు లోడింగ్ చేయాలని, తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా డబ్బులు వసూలు చేయకూడదని గుర్తుచేశారు. రాత్రి వేళల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, మరోసారి కథనాలు, ఫిర్యాదులొస్తే అటువంటి రీచ్‌లను నిలిపివేస్తామని పవార్ స్వప్నిల్ జగన్నాథ్ హెచ్చరించారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మూడు ఇసుక రీచ్‌లను రాత్రి సమయాల్లో వీఆర్వో, వీఆర్‌ఏ, పోలీసులు తనిఖీలు చేస్తుండాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్ జరుగుతుంటే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి, తవ్వకాలు నిలివేయాలని ఆదేశించారు. వీరితో కొల్లిపర మండల తహసీల్దారు జి.సిద్దార్థ, ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు, ఆర్‌ఐ వంశీకృష్ణ, వీఆర్వో రామారావు ఉన్నారు.
తెనాలి ట్రైనీ సబ్‌కలెక్టర్
పవార్ స్వప్నిల్ జగన్నాథ్
Comments
Please login to add a commentAdd a comment