కమిషనర్‌కు కాంట్రాక్టర్లు అల్టిమేటం
పెండింగ్ బిల్లుల సంగతి తేల్చాలని డిమాండ్
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లింపులు చేయకపోతే పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని.. పెండింగ్‌లో ఉన్న బిల్లులు ప్రాసెస్ చేయాలని కాంట్రాక్టర్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులును కలిసి అల్టిమేటం జారీ చేశారు. చాలా మంది కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లింపులు ఆలస్యం కావడంతో పెట్టుబడి కోసం తీసుకువచ్చిన అసలు, వడ్డీ కలిపి తడిసిమోపెడు అవుతోంది. జీఎంసీ పరిధిలో కొన్ని రూ.వందల కోట్ల పనులు జరిగాయని, వాటికి ఇంత వరకు ఎన్నింటికి బిల్లులు ప్రాసెస్ చేశారని, పెండింగ్‌లో ఎన్ని వర్కులు ఉన్నాయి, టెండరింగ్ స్టేజ్‌లో ఎన్ని వర్కులు ఉన్నాయి తదితర వివరాలు తమకు తెలియజేయాలని కోరారు. భవిష్యత్తులో జరిగే పనులకు ఏ విధంగా బిల్లుల చెల్లింపు చేస్తారో అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఇప్పుడు చేసిన వర్కులకు పేమెంట్ షెడ్యూల్డ్ ఇవ్వాలని కోరారు.
సీఎఫ్‌ఎంఎస్‌లో డబ్బులు ఉన్నాయా?
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసిన తరువాత వాటికి చెల్లింపులు జరుగుతాయి. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు రూ.10 లక్షలలోపు ఉన్న బిల్లులకు వెంటనే చెల్లింపులు జరపాలని ఆదేశించారు. అయితే చాలా మంది కాంట్రాక్టర్ల బిల్లులను నగరపాలక సంస్థ అధికారులు సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేయలేదు. దీంతో చాలా మందికి రూ.10 లక్షలలోపు బిల్లులు కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం బిల్లులు ఇవ్వకుంటే తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో ఉందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఇంజినీరింగ్ అధికారుల వద్ద పేర్కొంటున్నారు. ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు ప్రాసెస్ చేస్తామంటున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో డబ్బులు ఉన్నాయా.. లేవా? వంటి సందేహాలు కమిషనర్ వద్ద కాంట్రాక్టర్లు లెవనెత్తినట్లు సమాచారం. శుక్రవారం కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. సీనియార్టీ ప్రకారం బిల్లుల చెల్లింపు ఉంటుందన్నారు. కాంట్రాక్టర్స్‌కి అత్యవసర పరిస్థితుల్లో బిల్లులు ప్రాసెస్ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment