ప్రజలను మభ్యపెట్టిన కేంద్ర బడ్జెట్
డాక్టర్ యలమంచిలి శివాజీ
లక్ష్మీపురం: కేంద్రం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్ మాటల గారడీగానే కొనసాగిందని, ప్రజలను మభ్యపెట్టేలా ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ అన్నారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బడ్జెట్‌పై విశ్లేషణలో ఆయన మాట్లాడుతూ... అన్ని బడ్జెట్‌లలోనూ పేదలను కేంద్ర ఆర్థిక మంత్రి విస్మరించారన్నారు. చెప్పిన దానికి, వాస్తవ కేటాయింపులకు పొంతన ఉండటం లేదని తెలిపారు. గ్రోత్ రేట్ పెరిగి పోతుందనేది అబద్ధమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా విదేశాల బడ్జెట్ లెక్కలతో పొల్చి చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్థిక సరళీకరణ పేరు కాపాడే బడ్జెట్‌లా ఉందని, ప్రజా ప్రయోజనాల బడ్జెట్‌గా లేదన్నారు. ఆర్థికవేత్త డాక్టర్ అబ్బరాజు శేఖర్ మాట్లాడుతూ.. వికసిత భారత్ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ పరిణామం, కేటాయింపులు లేవన్నారు. మధ్యతరగతికి అనుకూలంగా ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లు మార్చడం హర్షణీయమని పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కేటాయింపులు తగ్గించడం శోచనీయం అన్నారు. సంస్థ కార్యదర్శి కొండాశివరామిరెడ్డి, ఆర్థికవేత్త డాక్టర్ జి.సధాకర్, జొన్నలగడ్డ రామారావు, పాటిబండ్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment