![లూటీ!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/cyberfraudpolice2fffffffinal_mr-1738786072-0.jpg.webp?itok=v-0ZyPC2)
లూటీ!
లాఠీ పేరుతో
పట్నంబజారు: సైబర్ నేరగాళ్లు రోజుకో ఆలోచనతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఓ సారి పోలీసులమని, మరోసారి అధికారులమని కొత్త దారుల్లో ఫోను చేసి బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండడమే పరిష్కార మార్గమని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు 65కుపైగా సైబర్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆన్‌లైన్‌లో వందల సంఖ్యలో అందుతూనే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపి మరీ దుండగులు దోచుకుంటున్నారు. నగదు బదిలీ చేసిన గంటల వ్యవధిలోనే ఫిర్యాదు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నెంబర్ 1930, ఆర్థిక నేరాలకు సంబంధించి 155260, సైబర్ క్రైమ్.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఉమెన్ ట్రాఫికింగ్‌లో ఇరికించి రూ.24 లక్షలు..
గుంటూరు నగరం కొత్తపేట పరిధి నెహ్రూనగర్‌కు చెందిన వృద్ధుడు వంకాలయ నాగేశ్వరరావుకు ఇటీవల కాల్ వచ్చింది. బెంగళూరు పోలీసులమని నమ్మించారు. ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతడి వద్ద నాగేశ్వరరావు పేరిట సిమ్‌కార్డు ఉందని చెప్పారు. నిందితుడు రూ. 30 లక్షల నగదు కూడా నాగేశ్వరరావుకు ఇచ్చినట్లు చెబుతున్నాడని వాట్సాప్ కాల్ ద్వారా భయభ్రాంతులకు గురి చేశారు. పరువు పోతుందని భావించి దఫాలుగా బ్యాంకులోని మొత్తం రూ. 24 లక్షలు వారికి పంపాడు. ఇంకా పంపకపోవడంతో బెదిరింపులు వచ్చాయి. అప్పటికిగానీ విషయాన్ని కుటుంబ సభ్యులకు నాగేశ్వరరావు తెలిపాడు. దుండగులు నకిలీ పోలీసులని తెలిసింది.
పార్శిల్ వచ్చిందంటూ రూ.11 లక్షలు..
నరసరావుపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సాయిసత్యశ్రీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ముంబై నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో నుంచి మాట్లాడుతున్నామని దుండగుడు చెప్పాడు. ఆమె పేరుతో వచ్చిన కొరియర్‌లో ల్యాప్‌టాప్, 450 గ్రాముల గంజాయి ఉన్నట్లు నమ్మించాడు. ఆమెకు సంబంధించిన క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పి భయపెట్టాడు. రూ.11 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నాడు. సత్యశ్రీ తన ఖాతా నుండి ఆ మొత్తం పంపారు. కుటుంబ సభ్యులకు తెలిశాక అసలు విషయం తేలింది.
సైబర్ నేరగాళ్ల కొత్త అవతారం
నేరం రూపు మారింది. అవగాహనా రాహిత్యానికి తోడు బాధితుల భయమే సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారింది. ఎక్కడో ఉండి ఫోన్‌లోనే పోలీసులమని, అరెస్టు చేస్తామని బెదిరించగానే బ్యాంకు ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చి మరీ వారికి పంపుతున్నారు కొందరు. ఆనక మోసం అని తెలిసి లబోదిబోమంటున్నారు.
నగ్న వీడియోతో ఎర వేసి రూ.8 లక్షలు..
గుంటూరు నగరం అరండల్‌పేటకు చెందిన వస్త్ర దుకాణ యజమానికి కొద్ది కాలం క్రితం అజ్ఞాత నెంబర్ నుంచి హాయ్ అంటూ మేసేజ్ వచ్చింది. మహిళ కావడంతో మాటలు కలిశాయి. రెండు రోజుల తర్వాత వాట్సాప్ వీడియో కాల్‌లో నగ్నంగా ఆమె వచ్చేసింది. వ్యాపారి సైతం నగ్నంగా మారడంతో మొత్తం వీడియో రికార్డు చేశారు. ఆ మరసటి రోజే మహారాష్ట్ర పోలీసునని ఓ వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు. మహిళను వేధిస్తున్నావని ఫిర్యాదు అందిందని, సదరు వీడియో కూడా పంపాడు. భయపడిన వ్యాపారి నుంచి రూ.8 లక్షలు లాగేశారు. కేసు పెడితే పరువు, కాపురం ఏమవుతాయోనని ఆయన వెనక్కితగ్గాడు.
Comments
Please login to add a commentAdd a comment