అప్పు అడిగితే ఇవ్వలేదని దాడి
తెనాలి రూరల్: అప్పు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావుపేటకు చెందిన కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీరావుపేటకు చెందిన షేక్ మస్తాన్ వలి కార్పెంటర్ పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వార్ఫ్ రోడ్డులో కోత మిషన్ వద్ద ఉండగా నంబర్ ప్లేటు లేని కారులో వచ్చిన కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్, మరో ముగ్గురు కలిసి మస్తాన్ వలిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. తక్కెళ్లపాడు వరకు కొట్టుకుంటూ తీసుకువెళ్లి అక్కడ పెట్రోలు బంకులో మస్తాన్ వలి నుంచి ఫోన్ పే ద్వారా రూ. ఐదు వేలు బలవంతంగా చెల్లించారు. తర్వాత పెదకాకాని–మంగళగిరి మీదుగా విజయవాడ తీసుకువెళ్లారు. దారి పొడవునా కర్రలు, చేతులతో విచక్షణరహితంగా కొట్టారని బాధితుడు వాపోయారు. అట్లాగే ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లి మళ్లీ తెనాలి తీసుకొచ్చారు. కౌన్సిలర్ ఇంటి వద్దకు తీసుకురాగా, అక్కడ నుంచి తప్పించుకొని బయటపడినట్లు బాధితుడు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తనను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అహ్మద్ అడిగిన డబ్బులు తాను ఇవ్వనందుకే ఈ దాడికి పాల్పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యాడు. విషయం తెలుసుకున్న తెనాలి త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్ బాబు రాత్రి 12 గంటల సమయంలో వైద్యశాలకు వచ్చి బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. అహ్మద్‌పై పలు కేసులు ఉన్నాయని, ఇటీవల రౌడీషీట్ తెరిచామని సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. గుంటూరు శారద కాలనీలో నివాసం ఉండే గండి డేవిడ్‌రాజు కుమారుడు సంజయ్ (34) గుంటూరులో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పోలకంపాడులో తెలిసిన వారు మృతి చెందడంతో చూసేందుకు వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో బైకుపై తిరిగి ఇంటికి వెళుతుండగా మంగళగిరి నుంచి విజయవాడ వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన సంజయ్‌ను ఓ ప్రైవేటు వాహనంలో విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంజయ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
రాజధానిలో పనులకు వచ్చిన
ఒడిశా యువకుడికి పాముకాటు
చికిత్స పొందుతూ విజయవాడ జీజీహెచ్‌లో మృతి
తాడికొండ: రాజధాని నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒడిశా కార్మికుడు పాముకాటుకు బలై మృతి చెందిన ఘటన తుళ్ళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సూరజ్ రాయ్(28) అనే యువకుడు తుళ్ళూరు శివారులో నిర్మాణంలో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో సెంట్రింగ్ పనిచేసేందుకు వచ్చాడు. మంగళవారం రాత్రి తిని నిద్రకు ఉపక్రమించగా.. బుధవారం వేకువ జామున 3 గంటలకు పాము కరిచింది. దీంతో స్థానిక కూలీలు తుళ్ళూరు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కలగయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment