సేవాసదనానికి ‘ఆదిమానవుడు’
తెనాలి: ‘జనారణ్యంలో ఆదిమానవుడు’ శీర్షికన గురువారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన లభించింది. ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో రద్దీ రోడ్డు వెంట దుస్తులు లేకుండా ఉంటున్న నడివయసు వ్యక్తి దుస్థితిపై ప్రధానమంత్రి కార్యాలయం వరకు లేఖ వెళ్లినా, ఫలితం లేకపోవటం, ప్రతిరోజూ ఎంతోమంది రాకపోకలు సాగించే మార్గంలో ఓ వ్యక్తి నగ్నశిలలా ఉంటున్న వైనంపై వచ్చిన కథనంతో అధికారులు స్పందించారు. గుంటూరు సమీపంలోని గోరంట్ల కేందంగా నడుస్తున్న కార్మల్ సేవాసదన్‌ను మున్సిపల్ ఆరోగ్య అధికారి కె.హెలెన్ నిర్మల సంప్రదించారు. వారు కోరిన ప్రకారం వన్‌టౌన్ ఎస్‌ఐ వి.మల్లికార్జునరావు అతడిని పరిశీలించి నిరభ్యంతర పత్రం అందజేశారు. దీనితో సేవాసదన్ నుంచి వచ్చిన సేవకులు గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అతడిని వాహనంలో ఎక్కించుకుని గోరంట్లకు తీసుకువెళ్లారు. తొలుత అతడు వాహనంలోకి చేర్చేందుకు సేవాసదన్ ప్రతినిధులు ప్రయత్నించినప్పుడు వెళ్లేందుకు నిరాకరించాడు. ‘ఇది నా ఇల్లు... ఇక్కడే ఉంటాను’ అంటూ గట్టిగా ప్రతిఘటించాడు. అయినప్పటికీ సేవా సదన్ సేవకులు వాహనం ఎక్కించుకున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేక రోడ్లవెంట సంచరించే వారిని ఆదుకోవటం సామాజిక బాధ్యతగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న చెప్పారు. గతంలో ఇతడికి సాయం కోసం వివిధ ప్రభుత్వ శాఖలు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. సేవాసదన్ సేవకుడు జాక్ క్లమాకస్ మాట్లాడుతూ గత సంస్థ దిక్కూమొక్కు లేనివారు, మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పించి, ఆదరణ కల్పిస్తున్నామని చెప్పారు. తెనాలి నుంచి తీసుకెళుతున్న మానసిక బాధితుడికి ఆశ్రయం కల్పించి ఆహారం, అవసరమైన మందులు ఇస్తామని చెప్పారు.
‘సాక్షి’ కథనంతో ఎట్టకేలకు
కదలిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment