పోలీసులకు ధ్యానం, యోగా అవసరం
ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల శిక్షణలో ఎస్పీ శ్రీనివాసరావు
నరసరావుపేట: పోలీసు సిబ్బంది శారీరక ధృఢత్వాన్ని పెంపొందించేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించటం చాలా అవసరమని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి 15 రోజుల పాటు యానువల్ మొబలైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇది ఏఆర్ పోలీసులకు ప్రతి ఏడాది పోలీసుల సామర్థ్యాలు మెరుగుపరచడం, ఆధునిక ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించడం, క్రమశిక్షణను బలోపేతం చేయడం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టడం లాంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. శిక్షణలో జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ వి.సత్తిబాబు పాల్గొని సిబ్బందికి ఆయుధాలను సమయోచితంగా ఉపయోగించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన మెలకువలు, సంరక్షణ పద్ధతులు తెలియజేశారు. ఆయుధాల నిర్మాణం, వాటి పనితీరు, శత్రువుపై దాడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కవాతు–మాబ్ కంట్రోల్ శిక్షణ ద్వారా పోలీసులు అత్యవసర పరిస్థితులలో గుంపును ఎలా నియంత్రించాలి, ప్రజా రక్షణలో మాబ్ కంట్రోల్ టెక్నిక్స్, వ్యూహాత్మక విధానాలు, బందోబస్తు విధులు, ముఖ్యమైన వ్యక్తుల భద్రత, ప్రిజనర్స్ ఎస్కార్ట్, గార్డు డ్యూటీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సెక్యూరిటీ ప్రోటోకాల్ గురించి వివరించారు. బీడీ టీం, డాగ్ స్క్వాడ్, పీఎస్‌వోలు, డ్రైవర్లు తదితర విభాగాల్లో సేవలందిస్తున్న ఏఆర్ పోలీసు సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ, అడ్మిన్, వెల్ఫేర్, హోంగార్డు ఆర్‌ఐలు, రాజా, గోపీనాథ్, కృష్ణ, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment