సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు
కేసు నమోదు చేసిన పోలీసులు
చీరాల టౌన్: వేటకు వెళ్లిన మత్స్యకారుడు సముద్రంలో గల్లంతైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మండలంలోని వాడరేవు గ్రామానికి చెందిన మత్స్యకారుడు ఓసిపిల్లి రమణ (57) సముద్రంలో వేట చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రమణ, మరో ముగ్గురు కలిసి సముద్రంలో వేట చేసేందుకు బోటులో వాడరేవు నుంచి కృష్ణాజిల్లా నాగాయలంక తీరప్రాంతం వైపు వేటకు వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి బోటులో నిద్రిస్తుండగా మత్స్యకారుడు రమణ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు. తోటి మత్స్యకారుల సాయంతో తీరంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గల్లంతైన రమణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాడరేవు నుంచి మూడు బోట్లలో పదిహేను మంది మత్స్యకారులు సముద్రంలో గాలిస్తూ తీరప్రాంత గ్రామాల మత్స్యకారులకు సమాచారం అందించారు. గల్లంతైన రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రమణ గల్లంతై నాలుగు రోజులు కావస్తున్నా నేటికీ ఆచూకీ తెలియరాలేదు. ఈమేరకు ఈపురుపాలెం ఎస్సై అంబటి చంద్రశేఖర్ గల్లంతైన రమణ కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment