సుల్తానాబాద్‌ను జల్లెడ పట్టిన పోలీసులు
● 160 మందికి పైగా విస్తృత తనిఖీలు ● 59 వాహనాల సీజ్ ● ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● నేరాల నియంత్రణకేనన్న అదనపు ఎస్పీ రమణమూర్తి
తెనాలి: పట్టణంలో పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెనాలి–గుంటూరు–నారాకోడూరు రోడ్డులోని సుల్తానాబాద్‌లో విస్తృతంగా తనిఖీ చేశారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈ ఏరియాలో వేకువజామున ఐదు గంటలకు పోలీసులు మోహరించారు. అదనపు ఎస్పీ జీవీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు నేతృత్వంలో రెండున్నర గంటలసేపు విస్తృతంగా తనిఖీలు చేశారు. ముందుగా సుల్తానాబాద్ దగ్గరి వ్యవసాయ మార్కెట్ యార్డులో తెనాలి సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో అదనపు ఎస్పీ సమావేశమయ్యారు. పలు సూచలనలిచ్చారు. అక్కడ నుంచి 150 మంది పోలీసులు, 10 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది బయలుదేరి సుల్తానాబాద్ సెంటర్‌కు చేరుకున్నారు. త్రీ టౌన్ సీఐ ఎస్.రమేష్‌బాబు, టూ టౌన్ సీఐ రాములునాయక్, వన్‌న్‌టౌన్ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బంది కలిసి బృందాలుగా విడిపోయారు. సుల్తానాబాద్ ఏరియాను జల్లెడపట్టారు. వడ్డెర కాలనీ, సుగాలీ కాలనీ, శివాలయం వీధి ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లారు. అక్కడ ఎవరైనా అనుమానితులు ఉన్నారా? ఎంతకాలంగా నివాసం ఉంటున్నారని ఆరా తీశారు. ఇళ్ల వద్ద ఉన్న ఆటోలు, బైక్‌లు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 56 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను సీజ్ చేశారు. త్రీ టౌన్‌న్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లుగా, అనుమానితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. సుల్తానాబాద్ ప్రాథమిక పాఠశాల ఎదురు వీధిలో ఓ ఇంట్లో ఉన్న ఇతర రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులను పోలీసులు గుర్తించారు. వారి వద్ద అనుమానాస్పదంగా ఓ కవర్‌లో ఉన్న పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నేరాల నియంత్రణ కోసమే..
కార్డన్ సెర్చ్ అనంతరం అదనపు ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీస్ బలగాలతో 340 దాకా ఉన్న ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 59 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇదే కార్డన్‌న్‌సెర్చ్ రానున్న రోజుల్లో సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment