![విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/harasementffffinal_mr-1738982270-0.jpg.webp?itok=G_jv1_UF)
విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు
ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ గుంటూరులో పరిచయం చేసింది కూడా మస్తాన్‌సాయి, అతని స్నేహితులే. సంపన్న వర్గాలు, కొంత మంది యువతులు, పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. దీనిలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న షరీఫ్, ఖాజామొహీద్దీన్, మస్తాన్‌సాయిలు గుంటూరు వాసులే. గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినా తనకున్న పలుకుబడితో పోలీసులు కూడా తమవైపు చూడకుండా చేసుకున్నారు. డ్రగ్స్ విషయంలో ఆరోపణలు రావడంతో వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ షేక్ ముక్తార్ బాషా సెప్టెంబర్ 30న ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవోకు లేఖ రాశారు. 1983లో హజరత్ కాలే మస్తాన్ వలీ దర్గాను వక్ఫ్ ఆస్తిగా గుర్తించి దానికి రావి మాజీ మస్తాన్‌రావును ముతవల్లీగా నియమించారు. మస్తాన్‌రావు చనిపోయిన తర్వాత అతని దత్తత కుమారుడైన రావి రామమోహనరావును కోర్టు ఆదేశాలతో తాత్కాలిక ముతవల్లీగా నియమించారు. 2021లోనే అతనికి దర్గా మీద ఎటువంటి హక్కులు లేవని, ఈ ఆస్తులన్నీ వక్ఫ్‌కే చెందుతాయని నోటీసు కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈలోగా రావి మస్తాన్ సాయి నార్కొటిక్ డ్రగ్స్ సప్లయి చేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసింది. మస్తాన్ సాయి తాత్కాలిక ముతవల్లీగా ఉన్న రామ్మోహన్ కుమారుడు కావడం, అతను అరెస్టు సమయంలో దర్గాలోనే తలదాచుకుని ఉండటంపై వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ వక్ఫ్ బోర్డు సీఈవోకి నివేదిక పంపారు. దర్గాను అడ్డం పెట్టుకుని అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ పవిత్రతను దెబ్బతీసుకున్న నేపథ్యంలో ముతవల్లీని తొలగించి దర్గాను వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. అయితే, కూటమి ప్రభుత్వంలో తనకు ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని రామ్మోహన్ దీనిపై ఎటువంటి ఆదేశాలు రాకుండా ఉన్నతాధికారులను మేనేజ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు కొందరు అండగా ఉన్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment