ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధం
తెనాలి: కృష్ణా–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెనాలి డివిజన్ ఎన్నికల అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహ వెల్లడించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణా–గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29వ తేదీతో పూర్తికానున్నదని తెలిపారు. ఎలెక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరి మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసినట్టు గుర్తు చేశారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈనెల పదో తేదీ కాగా, ఆ మరుసటి రోజు స్క్రూటినీ జరుగుతుందని, 13న తుది అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. రాజకీయ పార్టీలకు ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి, విధివిధానాలపై అవగాహన కల్పించామని తెలిపారు. పోలింగ్ కోసం తెనాలి డివిజనులో 51 కేంద్రాలు, నియోజకవర్గంలో 27 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. వెయ్యికన్నా అధికంగా ఓట్లు ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించాలన్న ఎన్నికల కమిషన్ సూచనపై డివిజనులో ఎనిమిది యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాలను ఎంపికచేసి పంపామని వెల్లడించారు. వీటిలో తెనాలిలో రెండు, మంగళగిరిలో రెండు, తాడేపల్లిలో మూడు, పొన్నూరులో ఒకటి ఉన్నాయని, అనుమతి వస్తే వీటితో కలిపి మొత్తం 59 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని సబ్ కలెక్టర్ తెలిపారు. తెనాలి డివిజన్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్లు 45,707 మంది కాగా, నియోజకవర్గంలో 23,707 మంది ఉన్నట్టు చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు జిల్లా కలెక్టరేట్‌లో శిక్షణ సదస్సులు ఉంటాయని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైన ఫిబ్రవరి 3 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల ఫ్లెక్సీల తొలగింపు, విగ్రహాలకు ముసుగులు వేయడం పూర్తయిందని చెప్పారు. అవాంతరాలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహ
Comments
Please login to add a commentAdd a comment