చెరువుకు జీవకళ
హన్మకొండ కల్చరల్: ఎత్తయిన గుట్టలు. చుట్టూ పచ్చందాలు. పక్కనే కొలువుదీరిన అమ్మవారు. జలసిరిని ఒడిసిపట్టినట్లుండే భద్రకాళి చెరువు పునర్జీవం పోసుకోనుంది. ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. శతాబ్దాల చరిత ఉన్న భద్రకాళి చెరువు 15 ఏళ్ల క్రితం వరకు ప్రజలకు దాహార్తి తీర్చింది. చెరువు ఆక్రమణలు, అన్యాక్రాంతంతో ఇందులోని నీరు కలుషితమైంది. తాగునీరు, సాగునీరు సరఫరాకు దూరమైంది. స్థానిక ప్రజా ప్రతినిధుల విన్నపంతో చెరువుకు పునరుజ్జీవం పోయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇరిగేషన్ అధికారులు చెరువు శుద్ధీకరణకు చర్యలు చేపట్టారు. తొలుత చెరువులోని మురుగు నీటిని పూర్తిగా తొలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఏడు రోజులుగా ఈప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. నీటి తొలిగింపునకు 15 రోజులు గడువు పెట్టినప్పటికీ గురువారం ఉదయం వరకు చెరువులోని 80 శాతం నీటిని దిగువకు వదిలేశారు. మరో మూడు రోజుల్లో చెరువులో నీటి చుక్క కనిపించకుండా ఖాళీ చేయనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
శుద్ధీకరణతో పునరుజ్జీవం
చెరువు శుద్ధీకరణ పూర్తయితే భద్రకాళి చెరువుకు మళ్లీ జీలకళ సంతరించుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి వరకు చెరువు శుద్ధి చేసి పూర్తి చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల నీరు పైపులైన్ల ద్వారా చెరువులో నింపి నగరానికి మళ్లీ తాగునీరందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ట్రై సిటీకి ఏకై క దిక్కుగా ధర్మసాగర్ చెరువు నిలిచింది. నీటి ఎద్దడిని అరికట్టేందుకు సమ్మర్ స్టోరేజీగా దీన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ ఒక్క చెరువుపైనే ఆధారపడకుండా భద్రకాళి చెరువును అభివృద్ధి చేసి శుద్ధ జలాలను నింపి తాగునీరందించేలా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాల్వ ల ద్వారా చెరువులోకి వచ్చే మురుగునీటిని రాకుండా కట్టడి చేసి శుద్ధీకరణ పనులకు శ్రీకారం చేపట్టారు. భద్రకాళి చెరువు నీటిని తూర్పు ప్రజలకు అందించి వేసవి తాపం తీర్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనేపథ్యంలో చెరువు పూడిక తీత పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
చెరువును చెర పట్టలేరిక..
భద్రకాళి చెరువును ఇక కబ్జా చేసే అవకాశం లేదు. ఇప్పటికే వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. దీనిపై అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న చెరువు చుట్టూ ఎత్తయిన కట్ట పోసి దానిపై అధికారులు సుందరీకరణ పనులు చేపట్టి పార్క్‌గా ఏర్పాటు చేశారు. దీంతో చెరువు భూమిని ఇకపై ఎవరూ కబ్జా చేయలేరని నగరవాసులు పేర్కొంటున్నారు.
భద్రకాళి చెరువులో 80 శాతం మురుగునీటి తొలగింపు
మరో నాలుగు రోజుల్లో
సరస్సు మొత్తం ఖాళీ
వేసవిలో తాగునీటి
సరఫరాకు కార్యాచరణ
4 క్వింటాళ్ల చేపల అమ్మకం
భద్రకాళి చెరువులో నీటి శాతం పూర్తిగా తగ్గిపోవడంతో మత్స్యకారులు చేపలను సులభంగా పట్టుకుంటున్నారు. చెరువు మత్తడి వద్ద మత్స్యకారుల సంఘం ప్రతినిధులు కేజీ రూ.120 నుంచి రూ.140 వరకు లైవ్ చేపలు విక్రయిస్తున్నారు. దీంతో చేపలను కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు. గురువారం ఒక్కరోజే సుమారు 4 క్వింటాళ్ల చేపలు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment