కొత్త ఓటర్ల నమోదుపై కలెక్టర్ల ప్రత్యేక దృష్టి
● డ్రాఫ్ట్ జాబితా ప్రకారం ఉమ్మడి
జిల్లాలో 30.33 లక్షల మంది ఓటర్లు
● ఎనిమిదిన్నర నెలల్లో
కొత్త ఓటర్లు 55,219 మంది..
● జనవరి వరకు మరింత
పెరిగేలా కార్యాచరణ
● ఆర్హులు నమోదు చేసుకునేలా
సదస్సులు
సాక్షిప్రతినిధి, వరంగల్:
కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అర్హులంతా ఓటుహక్కును నమోదు చేసుకునేలా కార్యాచరణను అమలు చేస్తున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా అవగాహన కల్పిచేందుకు క్యాంపెయిన్లు నిర్వహించనున్నారు. అక్టోబర్ 29న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈజాబితా ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 30,32,758లకు చేరింది. 2023 ఫిబ్రవరి 8 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 20 వరకు సుమారు ఎనిమిదిన్నర నెలల్లో కొత్తగా 55,219 మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అలాగే.. 27,338 ఓటర్లను అధికారులు వివిధ కారణాల చేత తొలగించారు. మరోమారు అర్హులైన వారు తమ ఓటును నమోదు చేసుకునేలా క్యాంపెయిన్లు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అఽధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఈ నెల 9, 10 తేదీల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అర్హులైన వారంతా తమ ఓటుహక్కును నమోదు చేసుకునేలా చూడాలన్న సీఈఓ తాజా ఆదేశాల మేరకు జిల్లాల్లో కలెక్టర్లు సదస్సులు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.
హనుమకొండ, వరంగల్‌పై దృష్టి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2025 జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. ఇందుకోసం గత నెల 28న ప్రకటించిన డ్రాఫ్ట్ జాబితాపై ఈనెల 28 వరకు డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తూనే.. కొత్త ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా ఎనిమిదిన్నర నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో కొత్తగా 55,219 మంది చేరగా... జనగామ 14,005, వరంగల్ 13,879, మహబూబాబాద్ 10,226, హనుమకొండ 8,708, ములుగు 4,475, భూపాలపల్లిలో 3926 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. తొలగించిన ఓట్లు, కొత్తగా చేరిన ఓటర్లతో పోలిస్తే వ్యత్యాసం ఉండగా.. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీఓలతో పాటు అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అర్హులు నమోదు
చేసుకోవాలి..
కొత్త ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఓటర్లను చైతన్యపర్చడం, భాగస్వామ్యం చేయడంపై కలెక్టరేట్‌లో స్వీప్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటుహక్కును నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు కలిగిన ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి.
– పి.ప్రావీణ్య, కలెక్టర్,
హనుమకొండ
మహిళా ఓటర్లే ఎక్కువ..
సుమారు ఎనిమిదిన్నర నెలల వ్యవధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లతో పాటు చనిపోయిన, ఇతర ప్రాంతాలకు మారిన వారిని తొలగిస్తూ.. అక్టోబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించింది. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో 14,86,220 మంది పురుష ఓటర్లు, 15,46,039 మంది మహిళలు, 499 ఇతరులు కలిపి మొత్తం 30,32,758 మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఈజాబితాలోనూ పురుషలకంటే మహిళా ఓటర్లే 59,819 ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో చనిపోయిన, మరో ప్రాంతానికి మార్పిడి చేసుకున్న, రెండేసి ఓట్లు, ఇంకా ఇతర కారణాలతో 27,338 మంది పేర్లు తొలగించి, 55,219 మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ జాబితాలో వెల్లడైంది. కాగా.. జాబితాపై ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయవచ్చని, ఈనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించేలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌స్టేషన్లలో బూత్‌లెవెల్ అధికారులు (బీఎల్‌ఓలు) అందుబాటులో
ఉండేలా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment