ఇంకా స్లాబు దశలోనే..
సాక్షి, వరంగల్: వరంగల్.. జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లు దాటినా ఇప్పటికీ పరిపాలన అంతా హనుమకొండ జిల్లా నుంచే కొనసాగుతోంది. వరంగల్, ఖిలా వరంగల్ మండలాలతో కలిపి వరంగల్ రూరల్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాగా 2021 ఆగస్టు 12న ఏర్పడింది. పొరుగున ఉన్న హనుమకొండలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లాకు ఆ జిల్లా కేంద్రంలోనే సమీకృత కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. కానీ, వరంగల్ జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆజంజాహి మిల్లు మైదానంలో చేపట్టిన కలెక్టరేట్ భవన పనులు 2025 జనవరి వరకు పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఇంకా స్లాబు దశలోనే ఉండడంతో మరో ఏడాది పట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. తన సొంత జిల్లా, నియోజకవర్గంలోనే సమీకృత కలెక్టరేట్ భవన పనులు ఆలస్యంగా జరగడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నెల 19న సీఎంవరంగల్‌కు రానుండడంతో ఈ భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేసేలా అధికారులకు ఆదేశాలివ్వాలని జిల్లావాసులు కోరుతున్నారు.
పిల్లర్లకే పరిమితమైన డీ–బ్లాక్..
జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనం పనులు 2023 జూన్ 17న మొదలయ్యాయి. ఆజంజాహి మిల్లు మైదానంలో కేటాయించిన 18 ఎకరాల స్థలంలో అప్పటి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేసి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభించింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఆ దిశగా వేగవంతం చేయలేదన్న విమర్శలొస్తున్నాయి. ఏ, బీ, సీ, డీ–బ్లాక్‌లుగా జీప్లస్–2 తో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏ, బీ, సీ– బ్లాక్‌లలో పిల్లర్లు పూర్తయి స్లాబుల దశలో ఉన్నాయి. డీ–బ్లాక్ ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. మిగిలిన గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్, ప్లంబింగ్, విద్యుత్, పెయింటింగ్ తదితర పనులకు మరికొన్ని నెలలు పడుతుంది. జిల్లా ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యే నాటికి కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ‘సమస్యలు విన్నవించడానికి, కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సెల్‌కు హనుమకొండకు వెళ్లాల్సి వస్తోంది. అలాగే, ఎకై ్సజ్, పౌరసరఫరాల విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యాలయాలు విసిరేసినట్లుగా హనుమకొండలో అక్కడక్కడా ఉన్నాయి. దాదాపు అన్ని విభాగాల కార్యాలయాల పరిస్థితి ఇలానే ఉంది’ అని సామాజిక కార్యకర్త బాలరాజు అన్నారు.
కొనసా...గుతున్న వరంగల్
సమీకృత కలెక్టరేట్ పనులు
ఆజంజాహి మిల్లు ప్రాంగణంలో
17 నెలలుగా నిర్మాణం
జిల్లాకేంద్రం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా హనుమకొండ నుంచే పాలన
19న సీఎం రేవంత్‌రెడ్డి రాక..
పనులు పుంజుకుంటాయని ఆశ
Comments
Please login to add a commentAdd a comment