బ్లాక్‌బెర్రీ ముస్తాబు..
తాడ్వాయి అడవుల్లో టూరిజం స్పాట్
● మరికొద్ది రోజుల్లోకి అందుబాటులోకి..
● ఆధునిక గుడారాలు ఏర్పాటు..
● ఇసుక మేటల మీద క్యాంప్‌ఫైర్
● బీచ్ వాలీబాల్ తరహా ఆటలకు అవకాశం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: చుట్టు ఎత్తైన కొండలు.. కొండల మధ్య నది.. నదిపై పడవలో ప్రయాణం. ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేం. బోటులో ప్రయాణిస్తూ కనుచూపు మేర ఉన్న ప్రకృతి అందాలకు పర్యాటకులు ఫిదా కావాల్సిందే. ఇలాంటి సుందర దృశ్యానికి కేరాఫ్ పాపికొండలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకులకు ఈ పర్యటన ఎంతో ప్రసిద్ధి. ఎత్తైన పాపికొండలపై పరుచుకున్న దట్టమైన అడవిలో గోదావరి నది ఇసుక తిన్నెల్లో బస చేసే కొల్లూరు హట్స్ ఎంతో ప్రసిద్ధి. అయితే కచ్చలూరు ఘటన తర్వాత ఈ హట్స్‌ను తీసేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పర్యాటకులకు ఆ లోటును తాడ్వాయి అడవుల్లోని బ్లాక్‌బెర్రీ ఫారెస్ట్ భర్తీ చేస్తోంది. తాడ్వాయి – పస్రా మధ్యలో ఉన్న ఏటూరునాగ రం అభయారణ్యంలో జలగలంచ వాగు సమీపంలో ఎకోటూరిజంలో భాగంగా అధికారులు గుడారాలను అభివృద్ధి చేశారు. ఇసుక మధ్యలో 50 ఆధునిక గుడారాలు సిద్ధమయ్యాయి. వాగులోని ఇసుక మేటల మీద క్యాంప్‌ఫైర్ అనుభూతిని పొందొచ్చు. బీచ్ వాలీబాల్ తరహా ఆటలకు అవకాశం కల్పించారు. పర్యాటకులు ప్రకృతిలో సేదదీరేలా అన్ని హంగులు రెడీ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. రామప్ప, లక్నవరం, మేడారం, బొగతా, మల్లూరు వెళ్లే పర్యాటకులు ఇక్కడ ఒక రోజు విడిది చేసి పచ్చని ప్రకృతిలో చక్కని అనుభూతులు సొంతం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment