ఎస్‌ఎస్‌ఈ రాజమౌళికి విశిష్టసేవా పురస్కార్
కేసముద్రం: సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో మహబూబాబాద్ సెక్షన్ సీనియర్ ఇంజనీర్ (ఎస్‌ఎస్‌ఈ) రాజమౌళికి విశిష్ట సేవా పురస్కార్ అవార్డు దక్కింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదల కారణంగా మహబూబాబాద్ సెక్షన్‌లోని మహబూబాబాద్ – తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య, ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో 20చోట్ల రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకుపోయిన సమయంలో సెక్షన్ సీనియర్ ఇంజనీర్ రాజమౌళి ముందస్తుగా పెట్రోల్ మెన్, బ్రిడ్జి వాచ్‌మెన్‌లను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా విధులు నిర్వహించారు. రైల్వేలోని ఇంజనీరింగ్ విభాగంలో రాజమౌళి చేసిన సేవలను గుర్తించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కార్ అవార్డును ఆయనకు శుక్రవారం అందజేశారు.
సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ
టోర్నమెంట్‌కు కేయూ హాకీ జట్టు
కేయూ క్యాంపస్: చైన్నెలోని మద్రాస్ యూనివర్సిటీలో ఈనెల 3న ప్రారంభమై 7వ తేదీ వరకు కొనసాగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ హాకీ పురుషుల జట్టు ఎంపికై ందని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య శుక్రవారం తెలిపారు. ఈ జట్టులో జి.ప్రవీణ్, బి.సింహాద్రి, బి.వరుణ్ తేజ్, బి.అఖిల్, జి.రాజు, ఎస్.రామకృష్ణ, జి.తేజ, పి.శ్రీకాంత్, ఎ.నగేష్, కె.రాజ్‌కుమార్, ఇ.వాసుదేవ్, ఎన్.చిరంజీవి, కె.జంగు, ఎస్.విజయ్ కుమార్, ఎస్.గౌతమ్ రాజ్, పి.సందీప్, బి.గోపిచంద్, మహ్మద్ ఉస్మాన్ ఘనీఖాన్ ఉన్నారు. ఈ జట్టుకు వరంగల్‌లోని బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్ సయ్యద్ యాసిన్, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ, కనిష్క డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.రాకేష్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు ప్రొఫెసర్ వెంకయ్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment