కొడుకు హత్యతో అనాథైన తండ్రి
లింగాలఘణపురం : హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ మల్లికార్జుననగర్‌లోని అనురాగ్‌రెడ్డి వర్కింగ్ బాయ్స్ హాస్టల్‌లో శనివారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం బండ్లగూడేనికి చెందిన అనిరెడ్డి మహేందర్‌రెడ్డి (36) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో మహేందర్ రెడ్డి తండ్రి సత్తిరెడ్డి అనాథయ్యాడు. భార్య లక్ష్మి ఎనిమిదేళ్ల క్రితమే కేన్సర్‌తో మృతి చెందగా పెద్దకొడుకు యాకుబ్‌రెడ్డి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కూతురు వివాహం చేయగా హైదరాబాద్‌లో ఉంటోంది. మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో క్యాబ్ నడిపిస్తూ హాస్టల్‌లో ఉంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్స్‌లో తీసుకున్న కారు వాయిదాలు చెల్లించకపోవడంతో కంపెనీ తీసుకెళ్లింది. దీంతో టెంపరరీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం స్వగ్రామం బండ్లగూడెం వచ్చిన మహేందర్‌రెడ్డి ఇక్కడే ఉంటున్నాడు. గ్రామంలో ఏమీ పనిలేకపోవడంతో మళ్లీ హైదరాబాద్‌లో కారు నడుపుతానంటూ తండ్రి సత్తిరెడ్డికి చెప్పి ఈ నెల 3న హైదరాబాద్ వెళ్లాడు. వెళ్లిన మరుసటి రోజే హాస్టల్‌లో శనివారం హత్యకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భార్య, పెద్దకొడుకు మృతి చెందగా చిన్నకొడుకై తనకు తోడుగా ఉంటాడని భావించిన తండ్రి సత్తిరెడ్డి.. మహేందర్ రెడ్డి హత్యతో దిక్కులేనివాడయ్యాడు. తనకు కొరివిపెడుతాడని అనుకున్న కొడుక్కే తానే తలకొరివి పెట్టాల్సి వచ్చిందంటూ బోరున విలపించాడు. కాగా, మహేందర్ రెడ్డి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.
● కేన్సర్‌తో భార్య, అనారోగ్యంతో పెద్దకొడుకు మృతి
● ఇంటి నుంచి వెళ్లిన మరుసటి రోజే చిన్నకొడుకు హత్య
Comments
Please login to add a commentAdd a comment