చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో ఎవరైనా ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాలు విక్రయించినా.. వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో గాలిపటాలు ఎగురవేయానికి సిద్ధమవుతున్నారు. గాలి పటాల విక్రయదారులు అమ్ముతున్న నైలాన్, సింథటిక్ ధారాలతో తయారు చేసిన చైనా మాంజాలు మనుషులతో పాటు పక్షలకు ప్రమాదకరమని పేర్కొన్నారు. జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు పర్యావరణ విపత్తుకు కారణమయ్యే ఈ చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసుల ఆధ్వర్యాన నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.2.65 లక్షల విలువైన చైనా మాంజాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రజలు కూడా ఈ విషయంపై పోలీసులకు సహకరించి చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారి సమాచారాన్ని డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
సీపీ అంబర్ కిషోర్ ఝా
Comments
Please login to add a commentAdd a comment