అద్దె భారం తగ్గేనా..?
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మాత్రం అద్దె భవనాలు, అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం ఉండగా.. ఎనిమిది కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రతి నెలా ప్రభుత్వం రూ.1,88,852 అద్దె చెల్లిస్తున్నది.
సాకారం కానున్న శాశ్వత భవనాలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అద్దె బకాయిలు రెండేళ్లుగా పేరుకుపోయాయని పేర్కొన్నారు. వాటికి శాశ్వత భవనాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న డీఐజీతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు సాకారం అవుతాయనే ఆశలు చిగురించాయి. దీంతో ఖజానాకు అద్దె భారం తగ్గే అవకాశం ఉంది.
గతేడాది మార్చిలోనే కలెక్టర్‌కు వినతి..
గతేడాది మార్చి నెలలో నాటి జిల్లా రిజిస్ట్రార్.. సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి శాశ్వత కార్యాలయాలకు స్థలాల సేకరణ నిమిత్తం అప్పటి కలెక్టర్‌కు వినతులు అందజేశారు. అయితే, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదు. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి శాశ్వత భవనాల నిర్మాణాలకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సొంత భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్వహించే అవకాశం ఉంది.
త్వరలో మంత్రితో సమావేశం..
ఉమ్మడి వరంగల్‌లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి త్వరలో రెవెన్యూ మంత్రితో సమావేశం ఉంది. అనంతరం శాశ్వత భవనాలకు స్థల సేకరణ చేపట్టే అవకాశం ఉంటుంది. తొలుత రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు మంత్రి ప్రకటన చేశారు.
– ఫణీంధర్, జిల్లా రిజిస్ట్రార్
కిరాయి భవనాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు
8 అద్దె భవనాల్లోనే..
రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు
మంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు..
ఉమ్మడి వరంగల్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దెల వివరాలు (రూ.లలో)
డీఐజీ కార్యాలయం : 24,989
వరంగల్ ఆర్వో : 84,651
భీమదేవరపల్లి : 6,147
నర్సంపేట : 24,463
వర్ధన్నపేట : 6,550
కొడకండ్ల : 3,294
స్టేషన్‌ఘన్‌పూర్ : 3,754
ములుగు : 18,000
జయశంకర్ భూపాలపల్లి : 17,004
Comments
Please login to add a commentAdd a comment