ప్రమాదాల నియంత్రణకు చర్యలు
హన్మకొండ అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని, కడిపికొండ ఆర్‌ఓబీ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో గుడెప్పాడ్ వరకు కొనసాగుతున్న పనులు పూర్తి చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు కృషి చేయాలన్నారు. కటాక్షపూర్ వద్ద పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని.. వడ్డేపల్లి జంక్షన్ నుంచి గోకుల్‌నగర్ వరకు సిగ్నళ్లు పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్ధులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. పోలీస్, రవాణా, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, అదనపు డీసీపీ సలీమా, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్, రవాణా, ఆర్‌అండ్‌బీ, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment