రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎంజీఎం: శారీరక, మానసిక బుద్ధి మాంద్యం, చెవిటి, మూగ, దంత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ ఐ.ప్రకాశ్ అధికారులకు సూచించారు. ఎంజీఎంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌ను గురువారం ఆయన సందర్శించి మాట్లాడారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ పిడియాట్రిషన్ డాక్టర్ మంజుల నాయక్, డెంటల్ సర్జన్ శ్రీలక్ష్మి, డైట్ మేనేజర్ అనిల్‌కుమార్, ఫిజియోథెరఫిస్ట్ పవన్‌కుమార్, సైకాలజిస్ట్ ప్రశాంత్, డెంటల్ టెక్నీషియన్ సంపత్‌కుమార్, స్టాఫ్ నర్సు హేమ, ఆడియాలజిస్ట్ వనజ, ల్యాబ్ టెక్నీషియన్ మాధవి, సిబ్బంది రమేశ్, సోషల్ వర్కర్ లావణ్య పాల్గొన్నారు.
నేడు ఎస్సీ కమిషన్
సభ్యుడి సమీక్ష
హన్మకొండ అర్బన్/వరంగల్: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ నేడు (శుక్రవారం) హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో ఉదయం జరిగే సమీక్షకు హాజరుకానున్నట్లు కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద తెలిపారు. రెండు జిల్లాల్లోని షెడ్యూల్డ్ కులాల కు సంబంధించిన పలు సమస్యలపై అధికారులతో ఆయన సమీక్షిస్తారని పేర్కొన్నారు.
కలెక్టరేట్లలో హెల్ప్‌డెస్క్‌లు
హన్మకొండ అర్బన్/వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల అమలుపై హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో ఈనెల 15 నుంచి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద తెలిపారు. ఈకేంద్రం ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాలవారీగా, వార్డుల వారీగా నిర్వహిస్తున్న గ్రామ సభలు, వార్డు సభలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఏమైనా సూచనలు, సందేహాలు ఉంటే హనుమకొండబ జిల్లా వారు టోల్ ఫ్రీ 1800 425 1115 నంబర్‌కు, వరంగల్ జిల్లా వారు 1800–425–3424 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.
ఐడీఏ వరంగల్ జిల్లా
అధ్యక్షుడిగా రాంప్రసాద్‌రెడ్డి
ఎంజీఎం: ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి ఎన్నికైనట్లు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, రమేశ్‌బాబు, వరుణ్ తెలిపారు. గురువారం రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం నూతన కార్యవర్గం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వేణుయాదవ్, కోశాధికా రిగా డాక్టర్ కార్తీక్, ఎలైట్ ప్రెసిడెంట్‌గా ఎం.జితేందర్, ఐఎంఎం మాజీ ప్రెసిండెంట్ ఎం.రమేశ్‌బాబు, ఉపాధ్యక్షులుగా ఎం.నవీన్, ఎస్.సంఘర్ష్, జాయింట్ సెక్రటరీగా కె.అభిలాశ్, సీడీహెచ్ కన్వీనర్‌గా శ్యాంసుందర్‌రెడ్డి, సీడీఈ కన్వీనర్‌గా సాయిచరణ్, ఎడిటర్‌గా పి. అఖిల్, కార్యవర్గ సభ్యులుగా జె.స్వామి, పి.సతీశ్, జె.మార్టిన్, ప్రసాద్, అరుణ్‌రాథోడ్, రాష్ట్ర ప్రతినిధులుగా వరుణ్‌రాజ్, చరణ్, దినేశ్ వ ర్మ, మ్రినాల్, పి.రాకేశ్ ఎన్నికైనట్లు తెలిపారు.
నేటి నుంచి పోలీస్ క్రీడలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ మూడో వార్షిక పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–25 నేడు (శుక్రవారం) ఉదయం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ జోన్లతో పాటు పోలీస్ అనుబంధ విభాగాలు ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగాలకు చెందిన క్రీడాకారులు 12 క్రీడాంశాల్లో పోటీ పడతారని వివరించారు. విజేతలకు క్రీడల ముగింపు రోజున బహుమతుల ప్రదానంతో పాటు వచ్చే నెలలో కరీంనగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఇంజినీర్లకు పదోన్నతులు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ డీఈలకు, ఈఈలుగా పదోన్నతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈ సంతోశ్‌బాబు, రవికుమార్, ఖమ్మం కార్పొరేషన్‌లో పని చేస్తున్న డీఈ మాధవికి ఈఈలుగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్‌కు బదిలీ చేశారు. బల్దియా డీఈ శ్యాంమోహన్‌కు పదోన్నతి కల్పిస్తూ జీహెచ్‌ఎంసీకి బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment