బకాయిలు పూర్తిగా వసూలు చేయాలి
వరంగల్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పేరుకుపోయిన మార్కెట్ ఫీజు బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని మార్కెట్ కమిటీ కార్యదర్శులను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ ఆదేశించారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ పరిధిలోని 18 మార్కెట్ కమిటీల కార్యదర్శులతో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో మార్కెట్ ఫీజుల బకాయిలు, నెలవారీ కొనుగోలు నివేదికలు (పర్చేజ్ రిటర్న్స్), అసెస్‌మెంట్లపై మార్కెట్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ మార్కెట్ ఫీజు లక్ష్యాలను మార్చి నెలాఖరులోగా సాధించాలన్నారు. పర్చేజ్ రిటర్న్స్ అసెస్‌మెంట్లు చాలా పెండింగ్‌లు ఉన్నాయని, ఇలా ఉంటే ఎలా అని మార్కెట్ కార్యదర్శులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పర్చేజ్ రిటర్న్స్ ప్రతినెలా 10వ తేదీలోపు వ్యాపారుల నుంచి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సక్రమంగా పర్చేజ్ రిటర్న్స్ ఇవ్వని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు మార్కెట్ ఫీజు పాత బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.66 కోట్ల మార్కెట్ ఫీజులు వసూలు చేయాలని నిర్దేశించగా ఇప్పటి వరకు కేవలం రూ.26 కోట్ల మాత్రమే వసూలు చేస్తే మిగిలిన ఫీజులు ఎప్పుడు వసూలు చేస్తారని కార్యదర్శులను లక్ష్మీబాయి ప్రశ్నించినట్లు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆమె అన్నారు. సమావేశంలో జేడీఎం ఉప్పుల శ్రీనివాస్, డీడీఎం పద్మావతి, వరంగల్ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.నిర్మల, డీఎంఓ సురేఖ, గ్రేడ్ 2 కార్యదర్శి రాము, అంజిత్‌రావులతో పాటు జనగామ, మహబూబాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల పరిధిలోని మార్కెట్ కార్యదర్శులు, జిల్లా మార్కెటింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మార్చిలోపు పెండింగ్‌లో ఉండకుండా చూడాలి
సమీక్షలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి
Comments
Please login to add a commentAdd a comment