లక్ష డప్పులతో వర్గీకరణ ఆకాంక్ష చాటుదాం
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నెహ్రూ సెంటర్/తొర్రూరు/డోర్నకల్ : లక్ష డప్పులతో ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను ప్రపంచానికి చాటుదామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోరుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న వేల గొంతులు – లక్ష డప్పుల కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం, తొర్రూరు, సీరోలు మండలం మన్నెగూడెంలో శుక్రవారం ఆయన పర్యటించారు. మాదిగ డప్పు కళాకారులతో ర్యాలీలు నిర్వహించారు. తొర్రూరులోని విశ్రాంతి భవనం ఎదుట చెప్పులు కుట్టారు. ఆయాచోట్ల ఉన్న అంబేడ్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా చోట్ల మాట్లాడుతూ మాలలు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటం, వర్గీకరణ సాధనకు ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచానికి జాతి ఆకాంక్ష వినిపించేలా మహాత్తర ప్రదర్శన జరగనుందని అన్నారు. మాదిగ జాతి బిడ్డల భవిష్యత్ కోసం, ఉద్యోగాల కోసం ఈ మహాత్తర కార్యక్రమం జరగబోతుందని, ఈక్రమంలో జాతి అభివృద్ధికి ప్రతిఒక్కరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మార్పీస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, నాయకులు దుప్పెళ్లి అనిల్‌మాదిగ, కత్తుల రేణు, పోలెపాక ఎల్లయ్య, పాటమ్మ రాంబాబు, బోడ సుమిత్ర, మిడతపల్లి యాకన్న, సోమారపు ఐలయ్య, మహంకాళి బుచ్చయ్య, తాటికాయల సురేందర్, భిక్షపతి, గుండాల రంజిత్, వెంకన్న, మంద యాకమల్లు, తేలూరి ముత్తయ్య, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment