నేడు నియామక ఉత్తర్వులు జారీ
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్లుగా ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 18న నియామక ఉత్తర్వులు అందించనున్నారు. ఈమేరకు అభ్యర్థులకు టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు సమాచారం అందించారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా వారికి నియామక ఉత్తర్వులు అందించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎంపికై నియామకాల ఉత్తర్వులు అందించకుండా జాప్యం చేయడంపై సాక్షి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. గత అక్టోబర్ 3న ఎదురుచూపులు ఎంతకాలం అనే శీర్షికతో, డిసెంబర్ 26న ఎన్నాళ్లీ ఎదురుచూపులు అనే శీర్షికతో, ఈనెల 10న ఆర్డర్స్ అందేదెప్పుడు? అనే శీర్షికతో సాక్షి పలు కథనాలు ప్రచురించింది. దాంతో యాజమాన్యం స్పందించి ఎట్టకేలకు నియామక ఉత్తర్వులను శనివారం అందించేందుకు సన్నాహాలు చేసింది. 2023, మార్చి 31న నోటిఫికేషన్ విడుదల చేసి అదే సంవత్సరం జూన్ 4న రాత పరీక్ష నిర్వహించారు. 2024 ఆగస్టు 1న ఫలితాలు విడుదల చేసి అదేనెల 22న సర్టిఫికెట్లను పరిశీలించారు. నెలలు గడుస్తున్నా నియామకాలు చేపట్టకపోవడంపై అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల మానసిక వేదనలపై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వారి కుటుంబ సభ్యుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
డిప్యూటీ సీఎం చేతుల మీదుగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లకు అందజేత
‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన
Comments
Please login to add a commentAdd a comment