మహా ప్రదర్శనను విజయవంతం చేయండి
హన్మకొండ: హనుమకొండలో ఈనెల 20న నిర్వహించనున్న లక్ష డప్పులు.. వేల గొంతుల సన్నాహక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని ప్రముఖ కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్ పిలుపునిచ్చారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ జాబితాలోని అన్ని కులాల వారికి విద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపదికన సమాన వాటా దక్కాలనే ప్రధాన ధ్యేయంతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్‌తో, మాలల కుట్రలు తిప్పి కొట్టేందుకు ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఈనెల 20న హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సన్నాహక మహా ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాజన సోషలిస్టు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్ రెడ్డి, ఆయా సంఘాల నాయకులు మంద కుమార్ మాదిగ, సుకుమార్, బొడ్డు దయాకర్ మాదిగ, బొచ్చు తిరుపతి మాదిగ, మేకల కేదారి యాదవ్, బైరపాక జయకర్, వీరదాసు వెంకటరత్నం మాదిగ, నీలా శ్రీధర్‌రావు, తండూరి మోహన్, వేల్పుల సూరన్న కాపు పాల్గొన్నారు.
కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్
Comments
Please login to add a commentAdd a comment