స్మార్ట్ సిటీ పనులు ఇంకెన్నాళ్లు?
సమీక్షలో కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే
వరంగల్ అర్బన్ : నగరంలో చేపట్టిన స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులు ఇంకెన్నాళ్లు నిర్వహిస్తారని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 31వ తేదీలోగా గడువు ఉందని అప్పటి వరకు పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆమె హెచ్చరించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో స్మార్ట్‌సిటీ పనులపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన 108 అభివృద్ధి పనుల్లో ఇప్పటి వరకు 57 పూర్తయ్యాయన్నారు. పనులు చేసే విధంగా కాంట్రాక్టు సంస్థలపై ఒత్తిడి తేవాలని, ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. ఈ సమీక్షలో బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, స్మార్ట్ సిటీ పీఎంసీ భాస్కర్ రెడ్డి, ఈఈలు మహేందర్, శ్రీనివాస్, సంతోష్ బాబు, డీఈ రవికిరణ్, ఏఈలు పాల్గొన్నారు.
23న అద్దె షటర్లకు బహిరంగ వేలం
వరంగల్, కాశిబుగ్గ సర్కిళ్ల పరిధిలోని బల్దియాకు చెందిన వ్యాపార సముదాయాల అద్దె షటర్లకు ఈనెల 23వ తేదీన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోచమ్మ మైదాన్‌లో షాపు నంబర్ 1 నుంచి 6 వరకు, కాశిబుగ్గలో షాపు నంబర్ 7,8,9, బొల్లికుంటలో షాపు నంబర్1,2,3,5 దుకాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరంగల్ హెడ్ పోస్టాఫీస్ షాపు నంబర్ 10,11,13,14,17 నుంచి 24 షాపుల వరకు, చార్‌బౌలిలోని 1 నుంచి 4 షాపుల వరకు, ఎల్లంబజార్ మార్కెట్ సైతం వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈనెల 22వ తేదీన దరఖాస్తుతో పాటు రూ.25,000లు డీడీ రూపంలో, రూ.2,00,000లు సాల్వేన్సి సర్టిఫికెట్‌ను సమర్పించాలని తెలిపారు. వీరికే 23న కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయంలో జరిగే బహిరంగ వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సమగ్ర సమాచారం సేకరించాలి: కమిషనర్
ఖిలా వరంగల్: రేషన్ కార్డుల సర్వేలో సమగ్ర సమాచారం సేకరించాలని బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శనివారం వరంగల్ 32వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో కొనసాగుతున్న సర్వే, దరఖాస్తుదారుల నుంచి సేకరిస్తున్న సమాచార వివరాలను పరిశీలించారు.
రబ్బానీ ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు
హజ్రత్ మాషూక్ రబ్బానీ ఉర్సు దర్గా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ఆశ్వినీ తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ఉర్సు దర్గా ప్రాంతంలో ఈనెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై పీఠాధిపతులు నవీద్‌బాబా, ఉబేద్‌బాబా, అధికారులతో కలిసి ఆమె శనివారం పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment