టీచర్ల్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: టీచర్ల, లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. జాక్టో మద్దతుతో తాను ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలో ఉండబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీతోపాటు గోపాల్‌పూర్‌లో వాకర్స్‌ను కలిసి మాట్లాడారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆరేళ్లు పలు సమస్యలను పరిష్కరించానని గుర్తు చేశారు. ఉపాధ్యాయల ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్ల వరకు, తెలంగాణలో మొదటి పీఆర్సీ 30 శాతం ఫిట్‌మెంట్ సాధన, సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించినట్లు తెలిపారు. కేజీబీవీ ఉపాధ్యాయినులకు 180 రోజుల మెటర్నటీ సెలవు సౌకర్యం వంటివి సాధించినట్లు వివరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ ఆరేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యా య, అధ్యాపక సమాజంలో ఉంటూ.. వారి సమస్య లపై పోరాటాలకు మద్దతుగా నిలిచానన్నారు. 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ ఏడాది మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఆట సదయ్య, రాష్ట్ర బాధ్యులు రవి, సుధాకర్‌రెడ్డి, రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి వి.రాంబాబు, వరంగల్, ములుగు, భూపాలపల్లి బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్
Comments
Please login to add a commentAdd a comment