‘బడిబయట’ విద్యార్థుల గుర్తింపు
విద్యారణ్యపురి: విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు తప్పనిసరిగా పాఠశాలల్లో చదువుకోవాలి. అయితే వివిధ కారణాలతో, చదువును మధ్యలోనే మానేసిన వారు, ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వలస వచ్చిన బడీడు పిల్లలు కొందరు బడిబయటే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బడిబయట వారిని గుర్తించి, పాఠశాలల్లో చేర్పించి విద్యాభ్యాసం కొనసాగించేలా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఆర్పీల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని 14 మండలాల్లో బడిబయట పిల్లల గుర్తింపు ప్రక్రియ ఈ నెల 25వ తేదీవరకు కొనసాగనుంది. సీఆర్పీలు ఇంటింటికి తిరుగుతూ బడిబయట పిల్లలను గుర్తిస్తున్నారు. సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను సంప్రదించి దీర్ఘకాలంగా బడికి రాని విద్యార్థులను కూడా గుర్తిస్తున్నారు. ఆయా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తున్నారు. అలాగే 15 నుంచి 19 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు ఎవరైనా విద్యను కొనసాగించకుండా ఉన్నట్లయితే వారిని సీఆర్పీలు గుర్తించి వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 39 మంది సీఆర్పీలు 36 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలోని ఆవాసాల్లో ఈ సర్వే చేసి ఇప్పటి వరకు 30 మందిని గుర్తించారు.
గుర్తించిన పిల్లలకు ప్రవేశాలు
బడిబయట ఉన్న 6నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన బాలురను అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో లేదా సంబంధిత ఆవాసంలోని పాఠశాలల్లో, బాలికలను కేజీబీవీల్లో చేర్పించనున్నారు. విద్యాభ్యాసం కొనసాగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. 15 నుంచి 19 సంవత్సరాల్లోపు విద్యార్థులు ఉంటే ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదివేందుకు ప్రోత్సహించనున్నారు.
కలెక్టర్ సమీక్ష
2025–26 విద్యాసంవత్సరానికి నిర్వహిస్తున్న బడిబయట విద్యార్థుల గుర్తింపు సర్వేపై కలెక్టర్ అధి కారులతో సమీక్ష నిర్వహించారు. సర్వేకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ సర్వే డిసెంబర్‌లో జరగాల్సి ఉండగా సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయి, జనవరి 10 నుంచి ప్రారంభమై కొనసాగుతోంది. సీఆర్పీలు ఆవా సం లేదా గ్రామం, పట్టణ ప్రాంతాల్లో అక్కడ పనిచేసే విశ్రాంత ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓల సహకారం తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలి. సర్వేను డీఈఓ వాసంతి, మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రబంధ పోర్టల్‌లో నమోదు చేయాలి
జిల్లాలో బడిబయట పిల్లలతోపాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటే సీఆర్పీలు గుర్తించి వారి వివరాలను ప్రబంధ పోర్టల్‌లో నమోదు చేయాలి. బడిబయట పిల్లల సర్వేను ఈనెల 25 వరకు చేయాలని ఆదేశాలిచ్చాం. ఆయా పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
– వాసంతి, డీఈఓ హనుమకొండ
సర్వేలో 39 మంది సీఆర్పీలు
25వరకు కొనసాగనున్న సర్వే
ఇప్పటివరకు 30 మంది గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment