బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్
వరంగల్ క్రైం : ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను గురువారం అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి తెలిపారు. నిందితురాలి నుంచి సుమారు రూ.15.50 లక్షల విలువైన బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హనుమకొండ పీఎస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ.. వరంగల్‌లోని శివనగర్‌కు చెందిన కట్రోజు విజయ భర్త కార్పెంటర్‌గా పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో మద్యానికి ఖర్చు చేస్తున్నాడు. పూట గడవడం కష్టంగా మారడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. దీంతో వస్త్రాల దుకాణాల్లో చీరల చోరీతో పాటు బస్సులు, రైళ్లు, ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతోంది. ఇంతేజార్‌గంజ్, మట్టెవాడ, ములుగు, హసన్‌పర్తి, కొత్తగూడెం, ఖమ్మం పరిధిలో 14 చోరీలకు పాల్పడి పలుమార్లు జైలు జీవితం గడిపింది. జైలు నుంచి విడుదలైన అనంతరం ఎలాంటి మార్పు రాలేదు. కాగా, నాలుగు రోజు క్రితం హనుమకొండ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగు నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసింది. చోరీ సొత్తును గురువారం విక్రయించేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా చోరీ సొత్తు కనిపించింది. దీంతో విచారించగా నేరాలకు పాల్పడినట్లు నిందితురాలు అంగీకరించడంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment