కమల దళపతి ఎవరో..?
హన్మకొండ: బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సభ్యత్వ నమోదు పూర్తి కావడంతో పాటు ఇప్పటికే వరంగల్ మహానగరంలోని డివిజన్‌లు, జిల్లాలోని మండల అధ్యక్షుల ఎన్నిక ముగిసింది. హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి బీజేపీ అధిష్టానం అత్యంత పకడ్బందీగా, ఆచీతూచి కమిటీల కూర్పు చేస్తోంది. గతంలో మండల పార్టీ అధ్యక్షులు, నగరంలోని వార్డు, డివిజన్‌ల అధ్యక్షులను జిల్లా కమిటీ ప్రకటించేది. ఈసారి రాష్ట్ర అధిష్టానమే ప్రకటించింది. అదే విధంగా జిల్లా అధ్యక్షక్ష పదవులను గతంలో రాష్ట్ర అధిష్టానం ప్రకటించగా ఈ సారి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పదవీకారం పూర్తికానుంది. బీజేపీలో ఒకరు రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్షులుగా కొనసాగుతారు. కానీ రావు పద్మ 2016లో వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలిగా మొదటి సారి, 2021లో రెండో సారి, 2024లో మూడోసారి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అమెకు అవకాశం లేకపోవడంతో పార్టీలో సీనియర్‌లతో పాటు జూనియర్‌లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.
అనుభవం, పార్టీ కార్యక్రమాలను వివరిస్తూ..
జిల్లా అధ్యక్షపదవిని ఆశిస్తున్న ఐదుగురు గతంలో వారు కొనసాగిన పదవులు, అనుభవం, పార్టీ కోసం చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు గాడ్ ఫాదర్‌ల ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరు సామాజిక సమీకరణాల్లోను అవకాశం దక్కేలా యత్నిస్తున్నారు. గతంలో ఆశించి పార్టీ నాయకత్వం సూచనల మేరకు పోటీనుంచి తప్పుకున్న వారు ఈసారైన తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మిగతావారు తాము పూర్తిగా సమయం కేటాయించి పార్టీ కోసం పని చేశామని, అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
భవిష్యత్‌ను దృష్టిలో
ఉంచుకుని..
రానున్నది స్థానిక సంస్థల ఎన్నికల కాలంకావడంతో అధిష్టానం ఈసారి ఆచీతూచి నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్ధల ఎన్నికలు రానున్నాయి. ఇందులో ప్రధానంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ సారి ఎలాగైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం ముందుకు పోతోంది. దీంతోపాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోను పట్టు సాధించాలనే ధృడసంకల్పంతో ఉంది. ఈ క్రమంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే తామనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనే ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, వారంలోపు నిర్ణయం వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.
చాడా
శ్రీనివాస్ రెడ్డి
గురిజాల
శ్రీరాంరెడ్డి
కొలను
సంతోష్ రెడ్డి
దేశిని
సదానందం
రావుల కిషన్
హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ
ప్రస్తుత అధ్యక్షురాలు రావు పద్మ పదవీ కాలం పూర్తి
రాష్ట్ర కమిటీకి ఐదుగురితో జాబితా.. జాతీయ కమిటీకి వెళ్లనున్న ముగ్గురి జాబితా
గాడ్ ఫాదర్‌ల ద్వారా ఎవరికివారు ముమ్మర ప్రయత్నాలు
చాలామంది ఆశావహులు..
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశిని సదానందం, ఆర్.పి.జయంత్‌లాల్, పరకాల నియోజకవర్గానికి చెందిన దామెర తాజా మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరాంరెడ్డి, కార్పొరేటర్ గుజ్జుల వసంత, బీజేపీ వరంగల్ పశ్చిమ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణతో పాటు మరికొందరు పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ వచ్చారు. రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన జిల్లా సంస్థాగత ఎన్నికల అధికారి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర పరిశీలకుడు తల్లోజు ఆచారి జిల్లా అధ్యక్షుల ఎంపికపై పరిశీలన చేశారు. అందరినుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆశావహులనుంచి ఐదుగురు పేర్లు ఎంపిక చేశారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్‌రెడ్డి, దేశిని సదానందం, మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరాం రెడ్డి పేర్లను రాష్ట్ర కమిటీకి పంపారు. ఈ జాబితాను రాష్ట్ర నాయకత్వం వడపోసి ముగ్గురి పేర్లు జాతీయ నాయకత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలోనుంచి ఒక్కరిని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment