![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/2/monkey%282%29_mr.jpg.webp?itok=eXMP07g3)
కుక్కలు సరే..
నగరంలో పెరుగుతున్న వానరాల బెడద
కాంట్రాక్టర్ల అనాసక్తి..
కోతుల సమస్యలపై ఫిర్యాదులందినా పాత పద్ధతుల్లోనే ఉచ్చులు వేసి పట్టుకుంటుండటం మినహా జీహెచ్‌ఎంసీలో కోతులను పట్టుకోవడంలో నిపుణులు లేరు. అందుకోసం టెండర్లను ఆహ్వానిస్తున్నప్పటికీ, కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. కోతులను పట్టుకునేందుకు సంబంధించిన టెండర్లలో జీహెచ్‌ఎంసీ తక్కువ మొత్తం మాత్రమే పేర్కొంటుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. పట్టుకున్న కోతుల్ని వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల మేరకు నిర్దేశించిన అడవుల్లో వదలాల్సిన బాధ్యత సైతం కాంట్రాక్టు ఏజెన్సీలకే ఉండటంతో క్లిష్టమైన పనులుగా భావించి ముందుకు రావడం లేదు. ఢిల్లీ వంటి నగరాల్లో కాంట్రాక్టు ఏజెన్సీలకు ఒక కోతిని పట్టుకుంటే రూ.6 వేలు, ఇతర నగరాల్లో రూ.5 వేలు చెల్లిస్తుండగా, జీహెచ్‌ఎంసీ మాత్రం రూ.1600 మాత్రమే చెల్లిస్తామంటోంది. ఈ సొమ్ముతోనే కోతుల్ని పట్టుకున్నప్పటినుంచి నిర్దేశిత అటవీప్రాంతంలో వదిలేంత దాకా దాని సంరక్షణ, ఆహారం, తదితర బాధ్యతలు కూడా కాంట్రాక్టు ఏజెన్సీలవేనని టెండరు నిబంధనల్లో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో కోతుల బెడద తీరడం లేదు.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ...
నగరంలో పద్మారావునగర్, న్యూబోయిగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, టోలిచౌకి, మెహదీపట్నం, ముషీరాబాద్, కాప్రా,మారేడ్‌పల్లి, అల్వాల్, అమీర్‌పేట్, తార్నాక, ఎల్‌బీనగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతులు వీధుల్లో తిరగడమే కాక ఇళ్లలోకి చొరబడుతుండటం, ఇంట్లో సామాగ్రి చెల్లాచెదురు చేస్తుండటం, అడ్డుకోబోతే మీద పడుతుండటంతో మహిళలు భయంతో బెంబేలెత్తుతున్నారు. ఎండాకాలంలో సమీప అటవీప్రాంతాల నుంచి ఆహారం కోసం కోతులు గుంపులు ఎక్కువగా నగరంలోకి వస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాల సమయంలో వీటి బెడద మరింత ఎక్కువని ఆయా ప్రాంతాల ప్రజలు పేర్కొన్నారు. కుక్కల బెడదతోపాటు కోతుల బెడద లేకుండా చేయాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగానిదే. ప్రస్తుతం కుక్కల సమస్యలపైనే దృష్టి సారిస్తున్న ఆ విభాగం కోతులకు సంబంధించిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment