అన్ని ఆలయాల్లో దీపోత్సవం
● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ● కీసరగుట్టలో ప్రత్యేక పూజలు
కీసర: అతి పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో సామూహిక దిపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని కీసరగుట్ట శ్రీ భవానీరామలింగేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించిన మహాలింగదీపోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యర్, పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామితో కలిసి మహాలింగ దీపోత్సవం వెలిగించారు. భక్తులకు మట్టి ప్రమిదలు నూనె, వత్తులు, పసుపు, కుంకుమ కిట్టును ఉచితంగా అందజేశారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆలయాలపై శ్రద్ధ పెట్టలేదని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యాదగిరిగుట్టతో పాటు తెలంగాణలోని అన్ని దేవాలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కీసరగుట్ట అభివృద్ధి కోసం కుడా ప్రత్యేక దృష్టి సారించామని, అభివృద్ధి పనుల కోసం డీపీఆర్‌ను కుడా సిద్ధం చేస్తున్నామన్నారు. కీసరగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. కేంద్రం నుండి వచ్చే ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు గర్భాలయంలో కొలువైన మూలవిరాట్ (శివలింగం) శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి నిర్వహించిన మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆమెకు పట్టువస్త్రాలు, ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వాదాలు అందచేశారు. ఆలయ చైర్మన్ తటాకం నాగలింగం, ఈఓ సుధాకర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, కీసర ఆర్డీవో సైదులు, టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌యాదవ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment