డిసెంబర్ 19 నుండి హైదరాబాద్ బుక్ ఫెయిర్
పంజగుట్ట: కంప్యూటర్లు వచ్చినా, ఈ బుక్స్, ఆన్‌లైన్ పరిధి ఎంత పెరిగినా పుస్తకం పేజీల వాసన చూసుకుంటూ చదివే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉందని ఎమ్మెల్సీ, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ సలహాదారు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను ఫెయిర్ సలహాదారు రామచంద్రమూర్తి, ఆచార్య రమా మెల్కోటె, ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..డిసెంబర్ 19 నుండి 29 వరకు ఎన్‌టీఆర్ స్టేడియం గ్రౌండ్స్, కళాభారతిలో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 12 నుండి రాత్రి 9 గంటలవరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. పాఠకులకు వారికి నచ్చిన పుస్తకాన్ని ఎంపికచేసుకోవడమే కాకుండా రచయితలను కలుసుకోవడం, వారితో చర్చించడం చేస్తారని తెలిపారు. గతంలో 15 నుండి 20 రోజులముందు స్టాల్స్‌కు దరఖాస్తులు చేసుకునేవారని ఈ సారి అన్నిభాషల రచయితలకు, పబ్లిషర్స్‌కు, రెండు నెలల ముందుగానే లేఖలు, ఈమెయిల్స్ చేశామని తెలిపారు. 350 స్టాల్స్‌కు అన్నింటికీ సమానంగా వ్యాపారం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో కేవలం ప్రింట్ మీడియా వారికే స్టాల్స్ కేటాయించేవారని ఇప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు స్టాల్స్ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు వారి ఐడెంటిటీ కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. బుక్‌ఫెయిర్‌లో స్టాల్స్ ఏర్పాటుకు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఫేస్‌బుక్ లైవ్‌లో డ్రాలు తీసి స్టాల్స్ కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో కోశాధికారి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు కె.బాల్‌రెడ్డి, శోభన్ బాబు, జాయింట్ సెక్రటరీలు కె.సురేష్, ఎం.సూరిబాబు, ఈసీ సభ్యులు జనార్థన్ గుప్త, విజయరావు, మధుకర్, కోటేశ్వరరావు, శ్రీకాంత్, శ్రీనివాసరావు, సాంబశివరావు, స్వరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment