స్తంభించిన మెట్రో సేవలు
సాంకేతిక సమస్యలతో నిలిచిన సర్వీసులు
● నాగోల్–రాయదుర్గం మధ్య రాకపోకలకు అంతరాయం
● తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సోమవారం పలు మెట్రో సర్వీసులు స్తంభించాయి. అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 11 గంటల మధ్య నాగోల్–రాయదుర్గం రూట్‌లో క్లాంప్స్ ట్రిప్ కావడంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ రూట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్య ప్రభావం వల్ల ఎల్‌బీనగర్–మియాపూర్ కారిడార్‌లోనూ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇటు ఎల్‌బీనగర్ నుంచి అటు నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు చేరుకొనేందుకు ప్రయాణికులు పడిగాపులు కాయవలసి వచ్చింది. ఉదయం ఆఫీసులకు వెళ్లవలసిన ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, వివిధ రంగాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అమీర్‌పేట్, బేగంపేట్, రాయదుర్గం, హైటెక్‌సిటీ, తదితర స్టేషన్‌లలో చిక్కుకుపోయారు. విద్యార్థులు కూడా సకాలంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేకపోయారు. 11 గంటల సమయంలో క్లాంప్స్‌ను పునరుద్ధరించారు. అనంతరం మూడు కారిడార్‌లలో మెట్రో సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. మరోవైపు తరచుగా ఇలా ఎక్కడో సాంకేతిక సమస్యలు తలెత్తి రైళ్లు నిలిచిపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, కేవలం 15 నిమిషాల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించి రైళ్లను పునరుద్ధరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment