భూ పోరాటాలు ప్రతి బిడ్డకూ తెలుసు | - | Sakshi
Sakshi News home page

భూ పోరాటాలు ప్రతి బిడ్డకూ తెలుసు

Published Wed, Nov 6 2024 6:48 AM | Last Updated on Wed, Nov 6 2024 11:49 AM

కళాకారిణులతో కేటీఆర్ తదితరులు

కళాకారిణులతో కేటీఆర్ తదితరులు

తెలంగాణ రియల్టర్స్‌ ఫోరం ప్రథమ వార్షికోత్సవంలో కేటీఆర్‌

శ్రీనగర్‌కాలనీ: భూమి కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు ఇక్కడి బిడ్డలందరికీ తెలుసు. ఎన్నో భూ ఉద్యమాలకు కేంద్రంగా తెలంగాణ నిలిచింది. రియల్టర్స్‌ ఫోరం మాదిరిగానే పార్టీ పెట్టే వరకూ తెలంగాణ శక్తి ఎవరికీ తెలియలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మంగళవారం శ్రీనగర్‌ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో తెలంగాణ రియల్టర్స్‌ ఫోరం మొదటి వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘చాలామంది తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని ప్రచారం చేశారు. కానీ నేడు దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. హైదరాబాద్‌ తలమానికంగా మారింది. 

గత పదేళ్లలో సంక్షేమమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి పథంలో నిలిపారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ ఎంతో వృద్ధి చెందింది. హైదరాబాద్‌లో ఎకరా రూ.వంద కోట్ల దాకా వెళ్లిందంటే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవచ్చు. రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ బీఆర్‌ఎస్‌ను, తెలంగాణను జాతీయ స్థాయిలో నిలిపిన ఘనత కేసీఆర్‌దే’ అని ఆయన స్పష్టం చేశారు. ‘మా తాతకు వందల ఎకరాలు ఉండేది. కానీ నీళ్లు లేకపోవడంతో కుదువ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్‌ ఇవన్నీ గమనించి నీళ్లతోనే అభివృద్ధి సాధ్యమని, పెద్దపెద్ద ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 

నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడింది. బిల్డర్లు పర్మిషన్లు తీసుకోవడం కష్టంగా మారింది. కాంగ్రెస్‌ చేస్తున్న పనులతో రియల్‌ ఎస్టేట్‌ కుంటుపడింది. మంత్రి పదవి గురించి అడిగితే గుంపు మేస్త్రీ మాదిరి పని చేస్తానని చెబుతుండటం విడ్డూరంగా’ ఉంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్‌ దందా చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో ఇంటిని కూల్చివేయడంతో ఓ గర్భిణి 40 ఏళ్ల పాటు ఈఎంఐ ఎలా కట్టాలని ప్రశ్నించిందని, దీనికి సీఎం, హైడ్రా అధికారులు ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement