ఊపిరి పీల్చగలిగేది రెండు నెలలే!
నగరంలో జూన్, జూలైల్లోనే స్వచ్ఛమైన గాలి
● మిగిలిన పది నెలలూ వాయు కాలుష్యమే
● స్పష్టం చేస్తున్న ఎయిర్ ఇండెక్స్ నివేదికలు
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగర ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభించేది ఏడాదిలో కేవలం రెండు నెలలే. మిగిలిన పది నెలలు వాయు కాలుష్యంతో వెంటాడుతోంది. నివాస ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల రికార్డు స్థాయిలో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయి. పెరిగిన వాహన రద్దీ, నిర్మాణ వ్యర్థాలు, తగ్గిన వృక్ష సంపద, పారిశ్రామికీకరణ తదితర అంశాలు వాయు కాలుష్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎయిర్ ఇండెక్స్ ప్రకారం అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో సోమాజిగూడ, గుడిమల్కాపూర్, నాచారం వంటి ప్రాంతాలు ఉన్నాయి. బంజారాహిల్స్, కోకాపేట్, మాదాపూర్, కేపీహెచ్‌బీ, మణికొండ, న్యూ మలక్‌పేట్, పుప్పాలగూడ, సైదాబాద్ వంటి ప్రాంతాల్లోనూ వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గాలి స్వచ్ఛత ప్రమాణాల ప్రకారం చూస్తే నగరంలో 1.8 రెట్లు వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశ సరాసరి ఏక్యూఐ 142 పీఎం ఉండగా, హైదరాబాద్ సరాసరి 86 పీఎంగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన గాలి అందగా, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొద్ది రోజులు మాత్రమే గాలిలో నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment