సుమారు 20 స్టేషన్ల ఏర్పాటు
ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు 40 కి.మీ
రూ.8 వేల కోట్లతో ఇప్పటికే అంచనాలు సిద్ధం
అలైన్‌మెంట్, వయడక్ట్‌లపై అధ్యయనం
తక్కువ భూ సేకరణతోనే నిర్మాణం
సుమారు 20 స్టేషన్ల ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో: ఫోర్త్‌సిటీ మెట్రోపై సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను (డీపీఆర్) రూపొందించేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ కసరత్తు చేపట్టింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ మార్గంలో మెట్రో నిర్మాణానికి రెండో దశలోనే ప్రణాళికలను సిద్ధం చేశారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 కారిడార్‌లకు డీపీఆర్‌లను సిద్ధం చేయడంతో పాటు మంత్రిమండలి ఆమోదం అనంతరం తాజాగా ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అయిదు కారిడార్‌లపై కేంద్రం ఆమోదంతో పాటు నిధుల విడుదలైతే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే రెండోదశలో భాగంగానే సుమారు రూ.8 వేల కోట్లతో ఆరో కారిడార్‌గా ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ రూట్‌పై డీపీఆర్ కోసం అధికారులు దృష్టి సారించారు. దశలవారీగా అన్ని కారిడార్‌లను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆరు కారిడార్‌లు పూర్తయితే 116.2 కి.మీ మార్గంలో మెట్రో రైల్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం సుమారు రూ.32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో మొదటి అయిదు కారిడార్‌లకు రూ. 24,237 కోట్లతో కార్యాచరణను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం..
● ఫోర్త్‌సిటీ మెట్రో నిర్మాణాన్ని మరిన్ని ఆధునిక హంగులతో చేపట్టనున్నారు. వినూత్న రీతిలో డీపీఆర్ రూపొందించాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రావిర్యాల, కొంగరకలాన్, మీర్‌ఖాన్‌పేట్ మీదుగా స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మించనున్న మెట్రో మార్గంపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 40 కి.మీ రూట్ అలైన్‌మెంట్, వయడక్ట్‌లతో పాటు ఎక్కడెక్కడ స్టేషన్‌లను నిర్మించాలనే అంశాలపై నిపుణులు దృష్టి సారించారు. ఫోర్త్‌సిటీ వరకు సుమారు 20 మెట్రో స్టేషన్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకొనేవిధంగా స్టేషన్ల నిర్మాణం ఉండనుంది.
● మరోవైపు ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్‌సిటీ వరకు నిర్మించనున్న ఈ రూట్‌లో చాలా వరకు ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ఉన్న సర్వీస్‌రోడ్డు మార్గంలోనే మెట్రో నిర్మాణం జరగనుంది. సుమారు 25 కి.మీ వరకు సర్వీస్ రోడ్డు మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. దీంతో పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు. మిగతా ప్రాంతాల్లో మాత్రం అవసరమైన చోట భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు, కొంగరకలాన్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రోడ్ల భూసేకరణలో భాగంగానే..
ప్రస్తుతం ఫోర్త్‌సిటీకి వివిధ రకాల అవసరాల కోసం ప్రభుత్వం భూసేకరణకు శ్రీకారం చుట్టింది. రోడ్లు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ హబ్స్ విస్తరణ, టౌన్‌షిప్‌లు వంటివి అందుబాటులోకి రానున్నాయి. వివిధ మార్గాల్లో 300 ఫీట్ల మేరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించేందుకు భూసేకరణ జరుగుతోంది. ఇందులో భాగంగానే మెట్రోకు అవసరమైన భూమిని కూడా సేకరించనున్నట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment