సైబరాబాద్ కమిషనర్‌కు బాధితుడి ఫిర్యాదు
గచ్చిబౌలి: ప్లాట్ పొజిషన్, అమ్మకం విషయంలో గచ్చిబౌలి సబ్ ఇన్‌స్పెక్టర్ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ సైబరాబాద్ కమిషనర్ ఆవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌కు సోఫా కాలనీకి చెందిన మహ్మద్ నవాజ్ ఫిర్యాదు చేశారు. గోపన్‌పల్లి సర్వే నెంబర్ 124 సోఫా కాలనీలో ప్లాట్ నంబర్ 23లో 200 చదరపు గజాల స్థలంలో షేక్ షుకూర్ అనే వ్యక్తి 13 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్నారు. షుకూర్‌ను భయభ్రాంతులకు గురి చేసి సెక్టార్ ఎస్‌ఐ మహేందర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం వేరే డాక్యుమెంట్లతో నానక్‌రాంగూడకు చెందిన మున్వర్ పాషా అనే వ్యక్తికి పొజిషన్ ఇప్పించారని నవాజ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. పొజిషన్ తీసుకున్న ప్లాట్‌ను తాను కొనేందుకు ఎస్‌ఐ సమక్షంలోనే రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా మున్వర్‌కు ఇచ్చానన్నారు. అంతకు ముందు సదరు ప్లాట్‌లో షుకూర్ అనే వ్యక్తి పొజిషన్‌లో ఉన్నాడని తెలియడంతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొంత జాప్యం చేశానన్నారు. ఆ గ్యాప్‌లోనే మున్వర్ గోపన్‌పల్లికి చెందిన వెంకటేష్ నాయక్ అనే వ్యక్తికి ప్లాట్ విక్రయించారని చెప్పారు. ప్లాట్ పొజిషన్, అమ్మకం విషయంలో ఎస్‌ఐ కీలకంగా వ్యవహరించారని సైబరాబాద్ కమిషనర్, మాదాపూర్ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం నిజమేనని, విచారణ చేపట్టనున్నట్లు ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. సదరు ఎస్‌ఐని సెక్టార్ నుంచి తప్పించగా సెలవులో వెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment