సాక్షి, హైదరాబాద్: నగరంలోని రామమ్మ కుంట ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించామని ప్రభుత్వం, పూర్తిగా తొలగించలేదని పిటిషనర్ పేర్కొంటున్నందున.. ఇరు పార్టీలు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వివరాలను పరిశీలించి తప్పుడు సమాచారం ఇచ్చిన వారి సంగతి తేలుస్తామని మౌఖిక హెచ్చరిక జారీ చేసింది. రెండు వారాలు సమయం ఇచ్చింది. ఆలోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రామమ్మ కుంట బఫర్ జోన్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ మానవ హక్కులు, వినియోగదారుల రక్షణ సెల్ ట్రస్ట్ ఏప్రిల్ 2023లో పిల్ దాఖలు చేసింది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు 2023 జూలైలో ఆదేశించింది. నగరంలోని చెరువుల, కుంటల ఇతర నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం 2024 జూలైన హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ కోర్టుకు హాజరయ్యారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 నీటి వనరులు ఉన్నాయని చెప్పారు. వీటిలో 230 చెరువులకు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ తుది నోటిఫికేషన్ ఇచ్చామని, 2,525 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చామని కోర్టుకు వెల్లడించారు. మూడు నెలల్లో వీటికి కూడా తుది నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
ఇరుపక్షాలు అఫిడవిట్లు సమర్పించండి..
ఈ పిటిషన్ గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కిరణ్‌సింగ్, కేంద్రం తరఫున ప్రణతిరెడ్డి హాజరయ్యారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ దాఖలు చేసిన నివేదికలో పేర్కొన్నట్లు నిథమ్ ఆక్రమణలు పూర్తిగా తొలగించలేదని కిరణ్‌సింగ్ వాదనలు వినిపించారు. మరోవైపు ఆక్రమణలు పూర్తిగా తొలగించినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఒకరు తొలగించామని, మరొకరు పూర్తిగా తొలగించలేదని వాదిస్తున్నారని, లిఖిత పూర్వక అఫిడవిట్ అందజేయాలని ఆదేశించారు. ఆక్రమణలు తొలగిస్తే పిటిషనర్.. తొలగించకుంటే సంబంధిత అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
రామమ్మ కుంట ఆక్రమణ తొలగింపుపై
హైకోర్టు హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment