మదర్ సెంటిమెంట్!
యాసీన్ భత్కల్..
● వీటిలో 62 మంది మరణానికి కారణం ఇతడే
● 2013లో అరెస్టు..అప్పటి నుంచి జైలు జీవితం
● కుటుంబీకులతోనూ మాట్లాడని ఈ గజ ఉగ్రవాది
● తల్లికి అనారోగ్యం కారణం చూపి పెరోల్ దరఖాస్తు
● కేవలం వీడియో కాల్‌కు మాత్రమే కోర్టు అనుమతి
● ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఐఎం కో–ఫౌండర్
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు యాసీన్ భత్కల్... నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్... 2013 దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సహా దేశ వ్యాప్తంగా పలు విధ్వంసాలకు కీలక సూత్రధారి... ఈ దుశ్చర్యలతో 62 మందిని పొట్టన పెట్టుకున్న గజ ఉగ్రవాది... 11 ఏళ్లుగా కారాగారవాసం చేస్తున్న ఇతగాడు ఇప్పటి వరకు కుటుంబీకులతో కనీసం మాట్లాడటానికీ ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం తీహర్ జైల్లో ఉన్న యాసీన్.. తాజాగా తన తల్లిని కలవడానికి ఒక రోజు పెరోల్ కోరితే... న్యాయస్థానం వీడియో కాల్‌కు మాత్రమే అంగీకరించింది.
ఐదు విధ్వంసాలకు సూత్రధారి...
కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప ఐఎం వ్యవస్థాపకుల్లో ఒకడై రియాజ్ భత్కల్ (2007 జంట పేలుళ్ల కేసు నిందితుడు) సోదరుడు. పదో తరగతి ఫెయిల్ కావడంతో 2005లో దుబాయ్ వెళ్లిన యాసీన్ 2007 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2008లో జరిగిన ఢిల్లీ బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ తర్వాత రియాజ్ తన మరో సోదరుడు ఇక్బాల్ భత్కల్‌తో కలిసి దేశం దాటేశాడు. దీంతో ఐఎం కో–ఫౌండర్‌గా మారిన యాసీన్ నేపాల్‌లోని పోఖారాలో యునానీ డాక్టర్ షారూఖ్ ముసుగులో తలదాచుకున్నాడు. అక్కడ ఉంటూనే రహస్యంగా దేశంలోకి రాకపోకలు సాగిస్తూ 2010, 2012ల్లో పుణే, 2010లో బెంగళూరు స్టేడియం, 2011లో ముంబై, 2013లో హైదరాబాద్‌ల్లో పేలుళ్లు చేయించాడు. వీటిలో 62 మంది మృత్యువాత పడగా... వందల మంది క్షతగాత్రులయ్యారు.
ఇండో–నేపాల్ సరిహద్దుల్లో పట్టివేత...
నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న 107 బస్టాప్, ఏ1 మిర్చి సెంటర్ పేలుళ్ల తర్వాత యాసీన్ గ్యాంగ్ అరెస్టు కోసం దేశంలోని అన్ని ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. కేంద్ర నిఘా వర్గాలు నేపాల్‌లో భారీ ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు 2013 ఆగస్టు 28న పట్టుకున్నారు. బీహార్ సరిహద్దుల్లోనే రక్సోల్ వద్ద అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ప్రకటించారు. తొలుత హైదరాబాద్ పేలుళ్ల కేసులో యాసీన్ మాడ్యుల్‌ను ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు విచారించింది. ఈ కేసులో ఇతడికి ఉరి శిక్ష విధించింది. అప్పట్లో యాసీన్ చాలా కాలం చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఆపై మిగిలిన కేసుల్లో విచారణ కోసం ఆయా రాష్ట్రాలు ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకువెళ్లాయి. ప్రస్తుతం ఇతగాడు ఢిల్లీలోని తీహార్ జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఖైదీగా ఉన్నాడు. ఎస్కేప్‌కు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గతంలో గుర్తించాయి.
ఇప్పటి వరకు మాటలు సైతం లేకుండా...
యాసీన్‌కు తల్లిదండ్రులు జరార్ సిద్ధిబప్ప, రెహానా సిద్ధిబప్పలతో పాటు భార్య జాహెదా ఇర్షన్ ఖాన్, పిల్లలు ఉన్నారు. ఈ గజ ఉగ్రవాది ఇప్పటి వరకు కుటుంబీకులతో కనీసం మాట్లాడను కూడా లేదు. వాళ్లు ములాఖత్‌లో కలవడానికి వచ్చినా ఇతగాడు అంగీకరించలేదు. ఇతగాడికి ఇప్పుడు సడన్‌గా మదర్ సెంటిమెంట్ పుట్టుకు వచ్చింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని కలవడానికి ఒక రోజు ఎస్కార్ట్ పెరోల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జైలు అధికారులు అభ్యంతరం తెలిపారు. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భత్కల్ వరకు యాసీన్‌ను తీసుకువెళ్లి, సురక్షితంగా వెనక్కు తీసుకురావడం పెను సవాల్ అంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
వీడియో కాల్‌కు అనుమతించిన కోర్టు...
దీంతో పెరోల్ పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం తిరస్కరించింది. అనారోగ్యంతో ఉన్న తల్లి రెహానాతో వీడియో కాల్ ద్వారా మాట్లాడటానికి మాత్రం అనుమతించింది. అయితే దీనికి కొన్ని షరతులు విధించింది. కేవలం జైలు అధికారులు ఇచ్చిన ఫోన్ మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆదివారం వీడియో కాల్ ద్వారా యాసీన్‌ను తన తల్లి రెహానాతో మాట్లాడించారు.
భ త్కల్ కుటుంబీకుల నివాసం
Comments
Please login to add a commentAdd a comment