తర్జన భర్జన
శిల్పా లేఅవుట్ ప్రాజెక్టు వ్యయం పెంపు
బల్దియా రివైజ్డ్ బడ్జెట్‌పై మల్లగుల్లాలు
● ‘స్టాండింగ్’ సమావేశానికి మరికొంత సమయం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కొత్త బడ్జెట్ (2025–26)కు సంబంధించి అధికారుల కసరత్తు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. గత నెల 30న స్టాండింగ్ కమిటీ ముందుంచిన ముసాయిదా బడ్జెట్‌పై సభ్యులు ఆక్షేపించడంతో మార్పు చేర్పులు చేసి తిరిగి సమావేశం నిర్వహించనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. 9వ తేదీ తర్వాత (కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ప్రజాపాలన– విజయోత్సవాల సంబరాలు ముగిశాక) స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమేరకు ఈ వారంలో రివైజ్డ్ బడ్జెట్ స్టాండింగ్ కమిటీ ముందుకు రానుందని భావించినప్పటికీ, దానికి సంబంధించి అధికారులు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ ఆదాయంపై టౌన్‌ప్లానింగ్ విభాగం తర్జనభర్జనల్లో ఉన్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో హైడ్రా ఝళిపిస్తున్న కొరడాతో చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు జరిపే వారికి అడ్డుకట్ట పడింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో టౌన్‌ప్లానింగ్ ఫీజుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని చూపించి.. తర్వాత ఆ మేరకు రాకపోతే విశ్వసనీయత ఉండదనే తలంపుతో సంబంధిత విభాగం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. గత సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆక్షేపించిన ఆస్తిపన్ను, ఎస్టేట్స్, ప్రకటనలు తదితర విభాగాలు తమ రివైజ్డ్ అంచనాలను ఖరారు చేసినప్పటికీ, టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి సోమవారం వరకూ ఆ ప్రక్రియ పూర్తి కాలేదని సమాచారం. రివైజ్డ్ బడ్జెట్ రూపొందించాక, సభ్యుల సమాచారం కోసం రెండు మూడు రోజులైనా ముందస్తుగా అందజేయాల్సి ఉంది. గత సమావేశానికే సకాలంలో అందలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వారంలో ఇక స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగే అవకాశం లేదు. వచ్చే వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు బడ్జెట్‌కు సంబంధించి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించే అవకాశాలు దాదాపు మృగ్యమే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల అనంతరమే రివైజ్డ్ బడ్జెట్ స్టాండింగ్ కమిటీ ముందుకు రానుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు భావిస్తున్నాయి.
రూ.435 కోట్ల నుంచి రూ.446.13 కోట్లకు..
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సార్‌డీపీలో భాగంగా చేపట్టిన శిల్పా లేఅవుట్ సంబంధిత పనుల వ్యయాన్ని ప్రభుత్వం పెంచింది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద కొండాపూర్ వైపు రెండో లెవల్‌లో ఓఆర్‌ఆర్ వరకు ఆరులేన్ల ఫ్లై ఓవర్, శిల్పా లే అవుట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 120అడుగుల రహదారి (వయా గ్యాస్ కంపెనీ), మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ఎలివేటెడ్ నిర్మాణ పనులకు గతంలో జారీ చేసిన పరిపాలన అనుమతుల్ని ప్రభుత్వం సవరించింది. అంచనా వ్యయం రూ.435 కోట్ల స్థానంలో మరో రూ.11.13 కోట్లు పెంచి రూ.446.13 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈమేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జీఓ జారీ చేశారు. పెరిగిన జీఎస్టీకి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ నివేదించిన పరిస్థితుల్ని పరిశీలించి ఈ అనుమతులు మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment