నిర్మాణాలకు అనుమతిచ్చిన వారినీ వదలొద్దు
హైడ్రా కమిషనర్ కామారెడ్డి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, సిటీబ్యూరో: చెరువుల్ని చెరబట్టి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. బుద్ధ భవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది అక్టోబర్ 9న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెరువుల కబ్జా అంశంపై మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన ఎస్‌ఎంఆర్ కాసా కరీనో, వజ్రం ఇక్సోరా, ఫీనిక్స్, కాండూర్, ది ప్రెస్టేజ్ సిటీ తదితర సంస్థలు చెరువుల్ని కబ్జా చేసిన విధానాన్ని ఆధారాలతో సహా వివరించారు. వీటిపై చర్యలు తీసుకోవడానికి రెండు నెలలు గడువు ఇస్తున్నట్లు అప్పుడే ఆయన ప్రకటించారు. కాల పరిమితి పూర్తి కావడంతో మంగళవారం హైడ్రాకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
చెరువులు కబ్జా చేసి నిర్మాణాల చేపడుతున్న కంపెనీలకు అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొత్త నాటకానికి తెర లేపిందని, అనుమతులు ఇచ్చిన అధికారులతో పాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రభుత్వ పెద్దలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణల నిరోధానికి కొత్త చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment