వడివడిగా..
100% మురుగు శుద్ధి వైపు జలమండలి అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ నగరంగా విస్తరిస్తున్న గ్రేటర్‌లో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జలమండలి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రోజువారీగా ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ప్రత్యేకంగా మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ప్రాజెక్టు చేపట్టిన విషయం విదితమే. అందులో ఇప్పటివరకు పదకొండు ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి. మరో తొమ్మిది ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో ఈ నెలాఖరులోగా పాలపిట్ట, వెన్నెల గడ్డ ఎస్టీపీలు, వచ్చే నెలలో అంబర్ పేట్, ముల్లకత్వ చెరువు, శివాలయ నగర్, నలగండ్ల, అత్తాపూర్, రెయిన్‌బో విస్తా, రామ చెరువు దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీలను అందుబాటులోకి తెచ్చేలా జలమండలి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు అమృత్ ఎస్టీపీలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కొత్త ఎస్టీపీల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
ప్రాజెక్టు–1లో 20 ఎస్టీపీలు
● వంద శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా జలమండలి రెండేళ్ల క్రితం కొత్త ఎస్టీపీ ప్రాజెక్టు చేపట్టింది. మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి సుమారు రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో 1259.50 ఎమ్మెల్డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మించాలని నిర్ణయించింది. స్థల సేకరణ వివాదాలు, ఇతరత్రా అభ్యంతరాలతో ఎస్టీపీల సంఖ్యను 20కి కుదించింది. మొత్తమ్మీద ఎమ్మెల్డీల సామర్థ్యం తగ్గకుండా చర్యలు చేపట్టింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ వినియోగిస్తూ ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టింది.
● ప్యాకేజీ–1 కింద అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 402.50 ఎంఎల్డీల సామర్థ్యం గల ఎస్టీపీలు. ప్యాకేజీ–2 కింద రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.13 కోట్లతో 480.50 ఎమ్మెల్డీల సామర్థ్యమున్న ఎస్టీపీలు. ప్యాకేజీ–3 కింద కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 376.50 ఎమ్మెల్డీల సామర్థ్యం గల ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో ఇప్పటికే సగం ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి.
ఇదీ పరిస్థితి..
హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజువారీగా రెండు వేలకు పైగా ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇది జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 1650 ఎమ్మెల్డీలుగా ఉంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుభ్రం చేయడానికి కొత్త ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
అమృత్ పథకం కింద
● కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను మంజూరు చేసింది. మొత్తం ఎస్టీపీల్లో ఒక ఎస్టీపీ పీపీపీ మోడ్‌లో.. మిగిలిన 38 ఎస్టీపీలను హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హమ్)విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. 972 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు.
● ప్యాకేజీ–1లో 16, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలను నిర్మిస్తారు. నిర్మాణ సంస్థ ఎస్టీపీలను 15 ఏళ్ల పాటు నిర్వహణకు చేపట్టనుంది. మొత్తం ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ. 2569.81 కోట్లు కాగా, 15 ఏళ్ల పాటు నిర్వహణకు రూ. 1279.29 కోట్లు అంచనా వ్యయం కానుంది. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం 30, రాష్ట్రం 30, నిర్మాణ సంస్థ 40 శాతం నిధులు సమకూర్చనుంది. ఈ ఎస్టీపీలను ఓఆర్‌ఆర్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని స్థానిక సంస్థలతో పాటు మూసీ నది ప్రక్షాళన కోసం వినియోగించనున్నారు. వీటి కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు.
జనవరి నాటికి ఎస్టీపీ ప్రాజెక్టు–1ను పూర్తి చేస్తాం
ఎస్టీపీ ప్రాజెక్టు –1ని వచ్చే జనవరి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాం. గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైతే ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుకోవాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించాం. రెండు షిఫ్టుల్లో పనులు జరగాలని సూచించాం. అమృత్ ఎస్టీపీలకు టెండర్లు ఆహ్వానించాం. నిర్దేశించిన గడువులోగా వాటిని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టనున్నాం.
– అశోక్ రెడ్డి, ఎండీ, జలమండలి
రెండు నెలల్లో మరో తొమ్మిది ఎస్టీపీలు
ఇప్పటికే 11 ఎస్టీపీలు అందుబాటులోకి
టెండర్ ప్రక్రియలో ఉన్నవి మరో 39..
ఇంకొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు
Comments
Please login to add a commentAdd a comment