నిర్లక్ష్యపు డ్రైవింగ్..
డ్రెవర్ల ర్యాష్ డ్రైవింగ్ తో విద్యార్థుల బెంబేలు
ఇటీవల తరచూ సంభవిస్తున్న ప్రమాదాలు
ప్రశ్నార్థకంగానే స్కూల్ బస్సుల సామర్థ్యం
కొరవడిన ఆర్టీఏ అధికారుల నియంత్రణ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో బడి బస్సులు భయపెడుతున్నాయి. బస్సుల నిర్వహణలో పాఠశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం పిల్లలకు, వాహనదారులకు శాపంగా మారుతోంది. బడి బస్సుల డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్‌తో బెంబెలెత్తిస్తున్నారు. సోమవారం మేడ్చల్ సమీపంలో ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఉదంతం పిల్లలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అదృష్టవశాత్తూ చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తరచూ ఎక్కడో ఒక చోట ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
నిర్లక్ష్యపు డ్రైవింగ్..
స్కూల్ బస్సులను నడిపేందుకు కనీసం అయిదేళ్ల అనుభవం కలిగిన వారినే డ్రైవర్లుగా నియమించాలి. కానీ.. అంతగా అనుభవం లేనివాళ్లను, అరకొర అవగాహనతో బస్సులను నడిపేవారిని ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో బీఎన్‌రెడ్డి నగర్, హబ్సిగూడ ప్రాంతాల్లో బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఈ రెండు చోట్ల బస్సు వెనక చక్రాల వద్ద ఆడుకుంటున్న పిల్లలను గమనించకుండా రివర్స్ చేయడం వల్ల పిల్లలు మృత్యువాత పడ్డారు. డ్రైవర్‌కు బస్సును అప్పగించే సమయంలోనే పాఠశాల యాజమాన్యం అతని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొంటే ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు పిల్లలను సకాలంలో స్కూళ్లకు చేరవేయాలనే ఒత్తిడి వల్ల కూడా కొందరు డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరుకు రోడ్లపై ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ భయపెట్టేస్తున్నారు.
ప్రశ్నార్థకంగా బస్సుల సామర్థ్యం..
● సాధారణంగా ప్రతి ఏటా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యే సమయానికి రవాణా అధికారులు వాటి సామర్థ్యాన్ని పరీక్షించాలి. పిల్లల కోసం బస్సులను వినియోగించేందుకు అవి అనుకూలంగా ఉన్నాయా? లేదా? అనేది ధ్రువీకరించాలి. ప్రతి సంవత్సరం సామర్థ్య పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా బడి బస్సులకు పరీక్షలు నిర్వహించారు. కానీ వాటి సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనా వేయడంలోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొందరు అధికారులు బస్సులు ఎలా ఉన్నా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను ఇచ్చేస్తున్నారు.
● సామర్థ్య ధ్రువీకరణలో కచ్చితమైన ప్రమాణాలను పాటించడం లేదు. మరోవైపు సామర్థ్య పరీక్షలకు రాకుండా తిరిగే బస్సులపై దాడులు చేసి తగిన చర్యలు తీసుకోవడంలోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో సుమారు 1,2000కు పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిలో ఇంకా కొన్ని సామర్థ్య ధ్రువీకరణకు దూరంగానే ఉన్నట్లు సమాచారం. మొదట్లో 15 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత స్పెషల్ డ్రైవ్‌లను విస్మరించారు. పిల్లల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా ఈ బస్సులపై నిరంతరం నిఘా ఉండాలి. కానీ రవాణా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ నిఘా లోపిస్తోంది.
పేరెంట్స్ కమిటీ ఓ కన్నేయాలి..
● బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉండాలి. అవసరమైన ఫస్ట్ ఎయిడ్ మందులు, ఇతర పరికరాలు కూడా ఉండాలి. బస్సుల తనిఖీల సమ యంలో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
● బస్సుల నిర్వహణ, డ్రైవర్ పనితీరుపై పిల్లల తల్లిదండ్రులు కూడా ఓ కన్నేసి ఉంచడం మంచిది. ఎలాంటి సందేహాలు ఉన్నా స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది.
డ్రైవర్ల ఎంపిక ఎంతో ముఖ్యం..
మోటారు వాహన చట్టం ప్రకారం స్కూల్ బస్సు డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించకుండా ఉండాలి. కానీ.. చాలా స్కూళ్లు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి.
పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్య పట్టికను విధిగా నిర్వహించాలి. ఇప్పటి వరకు అలాంటి పట్టికలు ఎక్కడా లేకపోవడం గమనార్హం.
యాజమాన్యం తమ సొంత ఖర్చులతో డ్రైవర్‌కు 3 నెలలకోసారి రక్తపోటు, షుగర్, కంటి చూపు వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలనే నిబంధన కూడా అమలుకు నోచుకోవడం లేదు.
డ్రైవర్‌ను నియమించేందుకు ముందు అతని అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. డ్రైవింగ్‌లో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. కానీ డ్రైవర్ ఎంపికలో విద్యాసంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
ప్రతి స్కూల్ బస్సుకు డ్రైవర్‌తో పాటు అటెండర్ తప్పనిసరిగా ఉండాలి. పైగా వాళ్లు యూనిఫామ్ ధరించి ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment