![At The Age Of 82 Woman Ran 125 Km In 24 Hours Made World Record - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/20/OLD-WOMEN.jpg.webp?itok=h5UieqFe)
ఇవేం లెక్కలబ్బా... అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? బార్బరా హంబర్ట్ అనే ఫ్రాన్స్ మహిళ రికార్డులివి. గత నెలాఖరులో జరిగిన ఫ్రెంచ్ చాంపియన్‌షిప్‌లో 24 గంటల్లో 125 కిలోమీటర్లు పరుగెత్తి ప్రపంచరికార్డు సృష్టించింది 82 ఏళ్ల బార్బరా. 24 గంటల్లో 105 కిలోమీటర్లు పరుగెత్తి ఓ జర్మన్ మహిళ నెలకొల్పిన రికార్డును బార్బరా బ్రేక్ చేసింది. ఆ వయసులో అలా పరుగెత్తిందంటే ఆమె జీవితమంతా రన్నింగేనేమో అనుకోకండి.
తనకు 43 ఏళ్ల వయసులో అంటే తన కూతురు హైస్కూల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ టైమ్‌లో రన్నింగ్ మొదలుపెట్టారామె. మొదట బౌఫ్‌మాట్‌వీధులకే పరిమితమైన బార్బరా పరుగు... తరువాత మారథాన్స్ దాకా వెళ్లింది. ఈ 39 ఏళ్ల కాలంలో పారిస్, న్యూయార్కుల్లో జరిగిన 137 రేసులు, 54 మారథాన్స్‌లో పాల్గొన్నది. ‘మొదట మెడిటేషన్‌లాగా మొదలుపెట్టాను. కానీ వీధుల్లో పరుగెడుతున్నప్పుడు కలిగిన స్వేచ్ఛా భావన నాకో స్పష్టతనిచ్చింది. అప్పటినుంచి పరుగును ఆపలేదు’ అంటుంది బార్బరా.
అంతేకాదు.. పరుగు పూర్తయ్యేవరకు దాహం, ఆకలి, నిద్ర అన్నింటినీ మరిచిపోతుంది. ముగింపు లైన్ దాటాకే ఆమెకు అలసట గుర్తొస్తుంది. 14 గంటల రేసులో ఆమెతోపాటు ఉండి... అవసరమైనవల్లా అందించిన ‘మై హస్బెండ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటారు బార్బరా. ఆ వయసులో పరుగు మొదలుపెడితే అడ్డంకులేం ఎదురు కాలేదా? అంటే... చాలా గాయాలయ్యాయి. నొప్పులొచ్చాయి. అయినా ఇవేవీ ఆమె పరుగును ఆపలేకపోయాయి. ఎలాంటి మందులు వేసుకోను, కేవలం ట్రైనింగ్‌నే నమ్ముతానని చెప్పే బార్బరా.. రన్నింగ్‌ను వదిలేస్తే మాత్రం నిరుత్సాహం ఆవహిస్తుందంటారు.
Comments
Please login to add a commentAdd a comment