వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడి హోదాలో శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. జగమొండి డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలనలో ఇతర దేశాలతో అమెరికా సంబంధాల విషయంలో గణనీయమైన మార్పులే సంభవించాయి.
కొన్ని దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక జో బైడెన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర దేశాలతో సాన్నిహిత్యం పెంచుకోవడం తమ ఎజెండాలోని కీలక అంశమని ఆయన ఎన్నికల ప్రచారంలో పలుమార్లు స్పష్టం చేశారు. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అమెరికా కొత్త అధ్యక్షుడి విధాన నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై దృష్టి పెట్టాయి.
చైనాపై సానుకూల ధోరణి!
ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలని తహతహలాడుతూ తమకు పక్కల్లో బల్లెంలా మారిన చైనాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారాలు మిరియాలు నూరారు. ఆ దేశంలో పలు అంక్షలు విధించారు. కరోనా వైరస్ పుట్టుకకు, వ్యాప్తికి చైనాయే కారణమని దూషించారు. వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. ట్రంప్ ఇంటిముఖం పడుతుండడంతో పరిస్థితులు మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా విషయంలో అమెరికా నాయకత్వం సానుకూల ధోరణి కనబరిచే అవకాశం ఉందంటున్నారు.
బైడెన్ గెలుపును చైనాలో మెజారిటీ జనం స్వాగతిస్తున్నారట! ఇక ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఇండియాతో స్నేహాన్ని అమెరికా వదులుకోలేని పరిస్థితి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టాలన్నా, అంతర్జాతీయ ఉగ్రవాదంపై యుద్ధం చేయాలన్న అమెరికాకు ఇండియా అండ కావాల్సిందే. కశ్మీర్, మైనారిటీల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే అయినా ఇండియా విషయంలో ఆయన వ్యతిరేకంగా వెళ్లలేరని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత సంతతి మహిళ కావడం ఇండియాకు కొంత కలిసొచ్చే అంశమే.
ఉత్తర కొరియాతో స్నేహమే
దూర్త దేశం అని అమెరికా ఒకప్పుడు అభివర్ణించిన ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో పలు సందర్భాల్లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. ట్రంప్ ప్రయత్నాలను బైడెన్ కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది.
రష్యాపై మరిన్ని ఆంక్షలు?
అమెరికాకు రష్యా నుంచి పెద్ద ముప్పు ఉందని జో బైడెన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. బైడెన్ పాలనలో తమ దేశంలో మరిన్ని ఒత్తిళ్లు, ఆంక్షలు తప్పకపోవచ్చని రష్యా నాయకత్వం అనుమాని స్తోంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అండతోనే డొనాల్డ్ ట్రంప్ గెలిచారన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. బైడెన్ హయాంలో అమెరికా–రష్యా సంబంధాలు బలహీనపడే అవకాశాలున్నాయి.
ఊపిరి పీల్చుకున్న ఇరాన్
ట్రంప్ పాలనలో అమెరికాకు ఇరాన్ బద్ధవ్యతిరేకిగా మారిపోయింది. అమెరికా విధించిన ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. అగ్రరాజ్యం ఆదేశాల మేరకు ఇతర దేశాలు ఇరాన్‌తో సంబంధాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇరాన్‌లో జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ట్రంప్ ఓడిపోయి, బైడెన్ గెలవడంతో ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. బైడెన్ చొరవతో తమ దేశంపై ఆంక్షలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ఇరాన్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జర్మనీ, ఈజిప్టు, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాలతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment